రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కృషి
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
● రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో
కీలక తీర్మానాలు
నిజామాబాద్‌అర్బన్: రోడ్డు ప్రమాదాల నియంత్రణకు విస్తృతస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటిస్తే ప్రమాదాలకు ఆస్కారం ఉండదని హితవుపలికారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో కలెక్టర్ అధ్యక్షతన శనివారం రోడ్డు భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రమాదాలను నిలువరించేందుకు శాఖల వారీగా చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జనవరి 1వ తేదీ నుంచి చేపట్టనున్న జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను విజయవంతం చేసేలా ప్రణాళికాబద్దంగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అతి వేగం, తాగి వాహనాలు నడపడం, సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడంతో కలిగే అనర్థాలను తెలియజేస్తూ విద్యార్థులు, వాహన డ్రైవర్లు, ప్రజలకు అవగాహన పెంపొందేలా హోర్డింగ్‌లు, సినిమా స్లైడ్స్, సోషల్ మీడియా, ఎఫ్‌ఎం రేడియో, లోకల్ చానెల్స్, డిజిటల్ డిస్‌ప్లే తదితర సాధనాల ద్వారా విరివిగా ప్రచారం చేయాలన్నారు. బ్లాక్ స్పాట్లలో తక్షణ చర్యలు చేపట్టి ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగించి, ఎత్తుపల్లాలు, గుంతలు ఉంటే వాటిని చక్కదిద్దాలని సూచించారు. అనంతరం మత్తు పదార్థాల నిరోధక కమిటీ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. మత్తు పదార్థాల నియంత్రణకు చేపట్టిన చర్యలపై చర్చించి, ఇకముందు అవలంబించాల్సిన చర్యలపై అధికారులకు కలెక్టర్ సూచనలు చేశారు. సమావేశాలలో అదనపు కలెక్టర్ అంకిత్, అదనపు డీసీపీ బస్వారెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ దుర్గాప్రమీల, ఎంవీఐ శ్రీనివాస్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సర్దార్ సింగ్, ఈఈ ప్రవీణ్, పంచాయతీరాజ్ ఈఈ శంకర్, డీఎంహెచ్‌వో రాజశ్రీ, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, రెడ్‌క్రాస్ ప్రతినిధి బుస్సా ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


