అన్నను చంపిన తమ్ముడు
భిక్కనూరు: అన్నను సొంత తమ్ముడే హతమార్చిన ఘటన మండలంలోని మొటాట్‌పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. భిక్కనూరు ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని మొటాట్‌పల్లికి చెందిన ఎర్రొల్ల రాజు(32, శివకుమార్ సొంత అన్నదమ్ముల్లు. రెండేళ్ల క్రితం రాజు తమ దగ్గరి బంధువైన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని హైదరాబాద్‌కు తీసుకువెళ్లాడు. అక్కడే వారు సహజీవనం చేస్తుండటంతో ఈ విషయమై కుటుంబంలో తరచు గొడవలు జరుగుతుండేవి. రెండు నెలల క్రితం రాజు ఒక్కడే గ్రామానికి వచ్చి, కూలి పనులు చేసుకుంటు జీవిస్తున్నాడు. రాజు వివాహేతర సంబంధం కారణంగా తమ పరువు పోయిందని, తనకు పెళ్లి సంబంధాలు రావడం లేదని తమ్ముడు శివకుమార్ అన్నతో గొడవపడేవాడు. శుక్రవారం రాత్రి కూడా అన్నదమ్ములు గొడవపడ్డారు. ఈక్రమంలో శివకుమార్ శనివారం వేకువజామున లేచి నిద్రిస్తున్న అన్న రాజును గొడ్డలితో నరికి హతమార్చాడు. సమాచారం అందుకున్న సీఐ సంపత్‌కుమార్, ఎసై అంజనేయులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
● అన్న వివాహేతర సంబంధంతో
కుటుంబంలో గొడవలు
● పరువు పోతుందని భావించి ఘాతుకానికి పాల్పడ్డ నిందితుడు


