రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
నిజాంసాగర్(జుక్కల్): పిట్లం–నిజాంసాగర్ ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందినట్లు నిజాంసాగర్ ఎస్సై శివకుమార్ తెలిపారు. మండలంలోని ఒడ్డేపల్లి గ్రామ శివారులో రోడ్డుపైన గుర్తుతెలియని వ్యక్తి శుక్రవారం అర్ధరాత్రి కాలినడకన వెళ్తున్నాడు. ఈక్రమంలో అతడినివె గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేవని, మృతుడి వయస్సు సుమారు 35 ఏళ్లు ఉండవచ్చని పోలీసులు పేర్కొన్నారు. మృతుడి భుజంపై సూర్యుడి బొమ్మ ఉందని, అచూకీ తెలిసిన వారు నిజాంసాగర్ ఎస్సై శివకుమార్ సెల్ 8712686172 నంబర్‌ను సంప్రదించాలన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నామని ఎస్సై తెలిపారు.


