పరిషత్ ఎన్నికల్లోనూ సత్తా చాటుతాం
● పంచాయతీ ఎన్నికల్లో
90శాతానికి పైగా స్థానాల్లో విజయం
● మీడియాతో టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్
నిజామాబాద్ రూరల్ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో 90 శాతానికిపైగా స్థానాల్లో విజయం సాధించామని.. మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ సత్తాచాటుతామని పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా రాష్టంలో ప్రజాపాలన కొనసాగుతోందన్నారు. వచ్చే ఎన్నికల నాటికి నిజామాబాద్ జిల్లాను కాంగ్రెస్ పూర్తిగా క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ గెలుపుకోసం కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో ఎలా కష్ట పడ్డారో ఈ ఎన్నికల్లో అంతకన్నా ఎక్కువ కష్టపడాలన్నారు. నాయకులకు ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, డీసీసీ అధ్యక్షుడు నగేశ్‌రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర కో ఆపరేటీవ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, నుడా చైర్మన్ కేశ వేణు తదితరులు పాల్గొన్నారు.


