క్రియాశీల పాత్ర పోషించాలి
● అధికారులు, సిబ్బందికి కలెక్టర్
దిశానిర్దేశం
● జీపీ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై
వీసీ ద్వారా సమీక్ష
నిజామాబాద్ అర్బన్: అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో క్రియాశీల పాత్ర పోషించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేలా సన్నద్ధం కావాలని అన్నారు. సమీకృత జి ల్లా కార్యాలయాల సముదాయం నుంచి మంగళవారం డీఎల్‌పీవోలు, ఎంపీడీవోలు, ఎంపీవోలతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించారు. ఎలక్షన్ కోడ్ పక్కాగా అమలయ్యేలా చూడాలని, రాజకీయ పార్టీలకు సంబంధించిన హోర్డింగులు, పోస్టర్లను, ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల గోడలపై రాతలను తొలగించా లని ఆదేశించారు. నిఘా బృందాలను నియమించి ఎలక్షన్ కోడ్ పకడ్బందీగా అమలయ్యేలా పర్యవేక్షించాలన్నారు. ఓటరు జాబితాను మరోసారి నిశితంగా పరిశీలించాలని, ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లు గమనిస్తే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అ నుసరిస్తూ నామినేషన్లు, పోలింగ్, కౌంటింగ్‌కు తగి న ఏర్పా ట్లు చేసుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, బోధన్, ఆర్మూర్ సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌రావు, నోడల్ అధికారులు, డీఎల్‌పీవోలు పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడానికి ముందు బోధన్ ఎంపీడీవో కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సన్నద్ధతను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎంపీడీవో కిశోర్‌కుమార్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.


