మరోసారి కొలువుదీరిన పాలకవర్గాలు
మోర్తాడ్: సహకార నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో పదవీకాలం పొడిగింపునకు నోచుకోని పాలకవర్గాలు హై కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో మళ్లీ కొలువుదీరాయి.
జిల్లాలోని 20 సొసైటీలకు వివిధ కారణాలతో పదవీకాలం పొడిగింపు ఇవ్వకపోగా, ఇందులో బాల్కొండ నియోజకవర్గంలోని 12 సొసైటీలు ఉన్నాయి. పాలకవర్గాల పదవీ కాలం ముగిసినా ఎన్నికలను నిర్వహించని కారణంగా గత పాలకవర్గాలకు ప్రభుత్వం పొడిగింపు ఇచ్చింది. బాల్కొండ నియోజకవర్గంలోని 12 సంఘాల పాలకవర్గాలకు మాత్రం ప్రభుత్వ నిబంధనల ప్రకారం పొడిగింపు దక్కలేదు. ఫలితంగా ప్రత్యేకాధికారులను నియమించి వారి ద్వారా పాలన సాగిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలో ఉన్నామనే కారణంతోనే ప్రభుత్వం తమ పదవీ కాలాన్ని పొడిగించలేదని ఆయా సంఘాల చైర్మన్‌లు హైకోర్టును ఆశ్రయించారు. బాల్కొండ నియోజకవర్గంలో మొత్తం 20 సహకార సంఘాలు ఉండగా ఎనిమిది సంఘాల పాలకవర్గాల పదవీ కాలాన్ని పొడిగించారు. పొడిగింపు అవకాశం దక్కని మోర్తాడ్, తాళ్లరాంపూర్, ఏర్గట్ల, బాల్కొండ, వేపంల్లి, బుస్సాపూర్, సావెల్, చౌట్‌పల్లి, కోనసముందర్, కోనాపూర్, పడిగల్ సంఘాల చైర్మన్‌లు కోర్టును ఆశ్రయించడంతో మధ్యంతర ఉత్తర్వులు వెలువడ్డాయి.
కోర్టు ఉత్తర్వులు జారీ చేసి నెల రోజులవుతున్నా ప్రభుత్వం పొడిగింపు ఉత్తర్వులను అమలు చేయ లేదు. చివరకు కోర్టు ఉత్తర్వులను పరిశీలించి పాలకవర్గాలపై అప్పీలుకు వెళ్తూనే పదవీకాలం పొడిగింపునకు అవకాశం కల్పించారు. ఇదిలా ఉండగా శెట్‌పల్లి సహకార సంఘం చైర్మన్ సింగిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆయన స్థానంలో మాత్రం ప్రత్యేకాధికారి కొనసాగుతున్నారు. ఈ సంఘాల పదవీకాలం మరో నాలుగు నెలల వరకు కొనసాగుతుంది. ఆ తరువాత ఎన్నికలను నిర్వహిస్తే కొత్త పాలకవర్గాలు ఏర్పాటవుతాయి. లేదంటే మరో సారి పాలకవర్గాల పదవీకాలన్ని పొడిగించే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కోర్టు ఆదేశాలను పాటించాం
కోర్టు ఆదేశాలను పాటించి పాలకవర్గాలకు పొడిగింపు ఆదేశాలు ఇచ్చాం. గతంలో ప్రభుత్వం విధించిన నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పాలకవర్గాలకు పొడిగింపు అవకాశం ఇవ్వలేదు. నియోజకవర్గంలో కేవలం 8 సంఘాలే ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొనసాగాయి. వాటికే పొడిగింపు ఉత్తర్వులు ఇచ్చాం. ఇప్పుడు మళ్లీ కోర్టు ఆదేశాల ప్రకారం 11 సంఘాలకు పాలకవర్గాలను కొనసాగించేలా చర్యలు తీసుకున్నాం.
– శ్రీనివాస్‌రావు, జిల్లా సహకార శాఖ అధికారి
కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో..
బాల్కొండ నియోజకవర్గంలోని
11 సంఘాల చైర్మన్‌లకు బాధ్యతలు
రెండు నెలలు ఆలస్యంగా
సొసైటీలకు చైర్మన్‌లు


