మహిళల అభ్యున్నతికి ప్రాధాన్యత
బోధన్: మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లోందని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతత్వంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై స్వయం సహాయక సంఘాల్లోని ప్రతి సభ్యురాలు అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే అవి సద్వినియోగం అవుతాయని సూచించారు. నియోజకవర్గ స్థాయిలో స్వయం సహాయ మహిళా సంఘాలకు ప్రభుత్వం మంజూరు చేసిన వడ్డీ లేని రుణాలను నియోజకవర్గ స్థాయిలో బోధన్‌లోని లయన్స్ కంటి ఆస్పత్రి ఆడిటోరియం హాల్‌లో మంగళవారం పంపిణీ చేశారు. ముఖ్య అథితిగా హాజరైన కలెక్టర్.. సబ్ కలెక్టర్ వికాస్ మహతోతో కలిసి మహిళా సమాఖ్య ప్రతినిధులకు చెక్కులను అందజేశారు. పలువురు స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు, సమాఖ్య ప్రతినిధులు బ్యాంక్ లింకేజీ, వడ్డీలేని రుణాల ద్వారా వ్యాపారాలు చేసి సాధించిన ఆర్థిక ప్రగతిని వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నియోజకవర్గం పరిధిలోని 3,703 ఎస్‌హెచ్‌జీల సభ్యుల బ్యాంకు ఖాతాల్లో రూ.4.26 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. నల్గొండ తర్వాత రాష్ట్రంలో అత్యధికంగా నిజామాబాద్ జిల్లాకు వడ్డీలేని రుణాలు కింద ప్రభుత్వం రూ.23 కోట్ల 26 లక్షలు కేటాయించిందని తెలిపారు. అలా గే ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరిట ప్రభుత్వం మంజూరు చేస్తోందని, సంఘాల సభ్యులకు ఇళ్ల నిర్మాణం కోసం రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలో రూ.67 కోట్ల రుణాలు అందజేసినట్లు వివరించారు. మహిళల గౌరవాన్ని మరింత ఇనుపడింపజేసేలా 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు ప్రభుత్వం ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తోందన్నారు. మండల మహిళా సమాఖ్య సమావేశాల్లో ప్రభుత్వ పథకాల పై చర్చ జరపాలన్నారు. తహసీల్దార్ విఠల్, ఐకేపీ డీపీఎం రాచయ్య, ఆయా మండలాల ఉద్యోగులు, మహిళా సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే ప్రభుత్వ సంకల్పం
కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
బోధన్‌లో ఎస్‌హెచ్‌జీలకు
వడ్డీ లేని రుణాల పంపిణీ


