
మళ్లీ పోటెత్తిన వరద
బాల్కొండ: ఎగువ ప్రాంతాల నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి మంగళవారం ఉదయం నుంచి మళ్లీ వరద పోటెత్తింది. దీంతో నీటి విడుదలను ప్రాజెక్ట్ అధికారులు పెంచారు. సోమవారం రాత్రి ఇన్‌ఫ్లో లక్షా 17వేలకు తగ్గగా, మంగళవారం ఉదయం లక్షా 45 వేల క్యూసెక్కులకు పెరిగింది. దీంతో 39 వరద గేట్లను ఎత్తి లక్షా 73 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎగువ నుంచి వరద పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6గంటల వరకు ఇన్‌ఫ్లో 2.27లక్షల క్యూసెక్కులు నిలకడగా ఉన్నప్పటికీ.. అవుట్ ఫ్లోను 2.75 లక్షల క్యూ సెక్కుల నుంచి 3.75లక్షలకు పెంచారు. రాత్రి వేళ ఇన్‌ఫ్లో లక్షా 75 వేల క్యూసెక్కులకు తగ్గింది. 40 గేట్ల ద్వారా 3లక్షల 12వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
వరద కాలువకు పెరిగిన నీటి విడుదల
వరద కాలువకు 20 వేల క్యూసెక్కులు, కాకతీయకు 4700, ఎస్కేప్ గేట్ల ద్వారా 3300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మిషన్ భగీరథ అవసరాలకు 231 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తుండగా, ఆవిరి రూపంలో 636 క్యూసెక్కులు పోతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా మంగళవారం సాయంత్రం 1088.10(70.14 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు.
ఎస్సారెస్పీ గేట్ల ద్వారా విడుదలవుతున్న నీరు
ఇన్‌ఫ్లో – అవుట్ ఫ్లో (క్యూసెక్కులు లక్షల్లో..)
40 వరద గేట్ల ఎత్తివేత