
నీట మునిగిన పంటలు
బోధన్/బోధన్ రూరల్/రెంజల్/వర్ని: భారీ వర్షాలకు తోడు నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో మంజీర నదిలోకి వరద పోటెత్తింది. సాలూర మండలంలోని మందర్నా, హున్సా, ఖాజాపూర్, సాలూర, బోధన్ రూరల్ మండలం హంగర్గ గ్రామాల శివారులో సోయా, వరి, పెసర, మినుము పంటలు వందలాది ఎకరాల్లో నీట మునిగాయి. పూతదశలో ఉన్న సోయాకు అపారనష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హంగర్గ గ్రామంలోని హనుమాన్ ఆలయం వరకు వరద నీరు వచ్చింది. గ్రామ శివారులోని 13 వందల ఎకరాల్లో సోయా నీట మునిగింది. వరద తగ్గిన తరువాత పంట నష్టంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మందర్నా గ్రామంలో తహసీల్దార్ శశిభూషణ్ సోమవారం రాత్రి బస చేసి వరద పరిస్థితిని పరిశీలించారు. ఎంపీడీవో శ్రీనివాస్ మంగళవారం గ్రామస్తులతో కలిసి వరద ఉధృతిని పరిశీలించారు. అడిషనల్ కలెక్టర్ కిరణ్‌కుమార్ సాలూర, హంగర్గ గ్రామాలను సందర్శించి వరదను పరిశీలించారు. అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట బోధన్ రూరల్ తహసీల్దార్ విఠల్, ఏవో సంతోష్, అధికారులు ఉన్నారు. సాయంత్రం వేళ సీపీ సాయిచైతన్య హంగర్గా, ఖండ్‌గావ్ గ్రామాలను సందర్శించిన వరద ఉధృతిని పరిశీలించారు. రెంజల్ మండలం కందకుర్తి శివారులోని రాష్ట్ర సరిహద్దులో ఉన్న వంతెన పైనుంచి మంగళవారం ఉదయం గోదావరి ప్రవహించింది. రెండు రాష్ట్రాల అధికారులు, పోలీసులు వంతెనకు ఇరువైపులా పికెటింగ్ ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు. సాయంత్రం వేళ వరద కాస్త తగ్గుముఖం పట్టింది. రెవె న్యూ, పోలీస్, వ్యవసాయ శాఖ అధికారులు నదీ పరివాహక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. గ్రామాల్లో దండోరా వేయించారు.
వందలాది ఎకరాల్లో సోయాకు నష్టం