ముఖ గుర్తింపుతో 60శాతం | - | Sakshi
Sakshi News home page

ముఖ గుర్తింపుతో 60శాతం

Aug 16 2025 8:19 AM | Updated on Aug 16 2025 8:19 AM

ముఖ గుర్తింపుతో 60శాతం

ముఖ గుర్తింపుతో 60శాతం

నూతన విధానంతో జిల్లాలో

1,20,246 మందికి పింఛన్ల పంపిణీ

వివిధ కారణాలతో మిగతా వారికి

పాత పద్ధతిలోనే అందజేత

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): చేయూత పింఛన్ల పంపిణీలో మరింత పారదర్శకత కోసం టీజీ ఆన్‌లైన్‌ అభివృద్ధి చేసిన ముఖ గుర్తింపు సాఫ్ట్‌వేర్‌(పేషియల్‌ రికగ్నిషన్‌)తో మొదటి సారిగా జిల్లాలో పింఛన్ల పంపిణీ పూర్తయింది. నూతన విధానం ద్వారా గ్రామాల్లో 60 శాతం మందికి పింఛన్లు అందజేయగా, మిగతా వారికి వివిధ కారణాలతో పాత పద్ధతిలోనే (వేలిముద్రలు తీసుకుని) పంపిణీ చేశారు. ముఖ గుర్తింపు సాఫ్ట్‌వేర్‌ కారణంగా పింఛన్ల పంపిణీ వేగవంతంగా పూర్తయినట్లు పోస్టల్‌ అధికారులు చెబుతున్నారు. చేతి వేలిముద్రల ద్వారా 10 మంది లబ్ధిదారులకు పింఛన్లు అందజేసేందుకు సుమారు అరగంట సమయం పట్టేది. ప్రస్తుతం ముఖ గుర్తింపు ద్వా రా కేవలం 15 నిమిషాల్లోనే పంపిణీ పూర్తవుతోంది. దీంతో లబ్ధిదారులు పోస్టాఫీసులు, గ్రామ పంచాయతీల వద్ద ఎక్కువ సేపు నిరీక్షించే పరిస్థితి పోయింది. అదే విధంగా గ్రామాల్లో బోగస్‌ పింఛన్లకు కూడా చెక్‌ పడినట్లయింది. బ తికున్నవారే పింఛన్లు పంపిణీ చేసే చోటికి వచ్చి డబ్బులు తీసుకుంటున్నారు. ఇటీవల జిల్లాలో జూన్‌ నెలకు సంబంధించిన పింఛన్‌ డబ్బులు పోస్టల్‌ అధికారులు గ్రామీణ లబ్ధిదారులకు ముఖ గుర్తింపు సాఫ్ట్‌వేర్‌తో పంపిణీ చేశారు. గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కూడా ఈ ప్రక్రియను పరిశీలించారు. నిజామాబాద్‌ కార్పొరేషన్‌తోపాటు ఆర్మూర్‌, బోధన్‌, భీమ్‌గల్‌ మున్సిపాలిటీల పరిధిలోని లబ్ధిదారులకు ఎప్పటిలాగే నేరుగా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేశారు.

పంచాయతీ కార్యదర్శులకు తప్పిన భారం

ఇది వరకు లబ్ధిదారులందరికీ చేతి వేలిముద్రల ద్వారా పింఛన్లు పంపిణీ చేస్తూ వచ్చారు. వేలిముద్రలు రానివారికి సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శి వేలిముద్రతో డబ్బులు అందజేశారు. పోయిన నెల వరకు పంచాయతీ కార్యదర్శులే బయోమెట్రిక్‌ పెట్టి జిల్లాలో సుమారు 12వేల మందికి పింఛన్లు ఇచ్చారు. ఇప్పుడు ముఖ గుర్తింపు సాఫ్ట్‌వేర్‌ రావడంతో వేలి ముద్రలు రాని లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పాయి. పంచాయతీ కార్యదర్శులతో పని లేకుండానే పింఛన్‌ డబ్బులు తీసుకున్నారు. దీంతో పంచాయతీ కార్యదర్శుల సహాయంతో పింఛన్లు పొందే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. తమకు కూడా పనిభారం తగ్గిందని పంచాయతీ కార్యదర్శులు ఊపిరి పీల్చుకున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో పింఛన్‌ లబ్ధిదారులు 2,01,243

ముఖ గుర్తింపుతో పింఛన్‌ పొందినవారు 1,20,246

వేలి ముద్రలతో పొందిన వారు 80,154

పంచాయతీ కార్యదర్శుల ద్వారా పొందిన వారు 843

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement