
ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా చూడాలి
● వీసీలో మంత్రులు పొంగులేటి, తుమ్మల, సీఎస్
● క్షేత్రస్థాయిలో సిబ్బంది సిద్ధంగా ఉన్నారు : కలెక్టర్
నిజామాబాద్‌అర్బన్: రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్, పోలీస్ కమిషనర్లతో సమీక్షించారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నందున ఎక్కడ కూడా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా అన్ని జిల్లాలకు ప్రత్యేకంగా రూ. కోటి చొప్పున నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. సహాయక చర్యలు పర్యవేక్షించేందుకు ఉమ్మడి పది జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో సాధారణ స్థాయిలోనే వర్షాలు కురుస్తున్నాయని, గురువారం ఉదయం సగటున 23 మి.మీ వర్షపాతం నమోదైందని మంత్రులు, సీఎస్ దృష్టికి తెచ్చారు. జిల్లాలో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, అయినప్పటికీ రానున్న 48గంటలపాటు భారీ వర్ష సూచన దృష్ట్యా అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు. ఎలాంటి పరిస్థితి తలెత్తినా సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు క్షేత్రస్థాయి సిబ్బంది సన్నద్ధమై ఉన్నారని వివరించారు. ఇప్పటికే అధికారులు, సిబ్బంది సెలవులను రద్దు చేశామన్నారు. జిల్లాలోని ఎస్సారెస్పీకి తక్కువగానే ఇన్‌ఫ్లో వస్తోందని, పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశామని, ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సమీక్షిస్తున్నామని తెలిపారు. 100 మంది ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది, శిక్షణ పొందిన మరో 20 మందితో కూడిన పోలీస్, ఫైర్ బృందం ఉందని, ఒక బృందాన్ని మెదక్ జిల్లాలో సహాయక చర్యలకు పంపించినట్లు పేర్కొన్నారు. వీసీలో సీపీ సాయి చైతన్య, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్‌కుమార్, డీఆర్డీవో సాయాగౌడ్, డీపీవో శ్రీనివాస్ రావు, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.