ఎంతో ఉపయోగం..
● హైవేపై నేటి నుంచి
వార్షిక టోల్ పాస్ అమలు
● రాజ్‌మార్గ్ యాత్ర యాప్ ద్వారా పాస్‌లు పొందే అవకాశం
ఇందల్వాయి( నిజామాబాద్ రూరల్): జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు ప్రయాణం మరింత సులభంగా, చవకగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం నేటి నుంచి వార్షిక టోల్‌పాస్ విధానాన్ని అమలు చేయనుంది. ఒకసారి రూ.3వేలు చెల్లిస్తే సంవత్సరంలో టోల్‌గేట్ గుండా 200 ట్రిప్పులు వెళ్లవచ్చు. ఒకసారి టోల్‌గేట్ దాటితే ఒక ట్రిప్పుగా పరిగణిస్తారు. ఈ వార్షిక పాస్ కోసం వాహనదారులు ఇప్పుడు ఉన్న ఫాస్టాగ్‌కే రాజ్‌మార్గ్ యాత్ర యాప్ లేదా ఎన్‌హెచ్‌ఏఐ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకొని రూ.3వేలు చెల్లిస్తే, రెండు గంటల్లో యాక్టివేట్ అవుతుంది. కాల పరిమితి లేదా 200 ట్రిప్పులు పూర్తవగానే వాహనదారుడి ఫాస్టాగ్ పాత విధానం (పే ఫర్ యూజ్)లోకి మారిపోతుంది.
తెలుపు రంగు నంబర్ ప్లేట్ ఉంటేనే..
ఈ వార్షిక టోల్‌పాస్ తెలుపు రంగు నంబరు ప్లేటు కలిగిన వాహనాలకు మాత్రమే ఈ విధానం వర్తిస్తుంది. పసుపు రంగు నంబరు ప్లేటు కలిగిన వాహనాలకు వర్తించదు. ఒక వాహనంపై పొందిన వార్షిక పాస్ మరో వాహనానికి వర్తించదు. వార్షికపాస్ తీసుకోవటం తప్పనిసరి కాదు. రాష్ట్ర రహదారులు, ఔటర్ రింగ్ రోడ్లు, మున్సిపల్ టోల్స్ వద్ద ఈ వార్షిక టోల్‌పాస్ చెల్లుబాటు కాదు.
ఇందల్వాయి టోల్‌ప్లాజా
వ్యాపార పనుల నిమిత్తం ఇదివరకు నిజామాబాద్ నుంచి హైదరాబాద్‌కు నెలలో ఐదారు సార్లు వెళ్లేవాన్ని. ఈ క్రమంలో టోల్‌చార్జీలే రెండు మూడు వేల రూపాయలు కట్టేవాన్ని. వార్షిక టోల్‌పాస్ ద్వారా వందల్లోనే కట్టాల్సి రావడం సంతోషకరం. ప్రయివేటు వాహనదారులకు ఈ పాస్ ఎంతో ఉపయోగకరం. –కుంట గంగారెడ్డి, నల్లవెల్లి
200 ట్రిప్పులు.. రూ.3000