
ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరు మెరుగుపర్చాలి
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
● వైద్యశాఖ అధికారులతో సమీక్ష
నిజామాబాద్‌అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరు మరింతగా మెరుగుపడాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. వైద్యవిధాన పరిషత్ పరిధిలో కొనసాగుతున్న జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరుపై కలెక్టర్ గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని ఆయా ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది ఖాళీలు, వాటి భర్తీకి చేపట్టిన చర్యల గురించి జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త డీసీహెచ్‌ఎస్ శ్రీనివాస్ ప్రసాద్‌ను కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఖాళీల భర్తీ కోసం ఉన్నతాధికారులకు పంపిన ప్రతిపాదనలను పరిశీలించారు. విభాగాల పనితీరును సమీక్షించారు. కాగా, వర్ని, ధర్పల్లి తదితర ప్రాంతాల్లో నూతనంగా నిర్మిస్తున్న ఆస్పత్రుల భవన నిర్మాణాల పనులు వేగంగా , నాణ్యతతో జరిగేలా పర్యవేక్షణ చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, డీఎంహెచ్‌వో రాజశ్రీ, తదితరులు పాల్గొన్నారు.