
రాష్ట్ర ప్రభుత్వమే నిధులు ఇవ్వడం లేదు
● నిధులు ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం
● ఆగిపోతున్న రైల్వే బ్రిడ్జిల పనులు
● మీడియాతో ఎంపీ అర్వింద్
నిజామాబాద్ అర్బన్: జిల్లాలో జరుగుతున్న రైల్వే అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వమే నిధులు కేటాయించడం లేదని, ఆలస్యం చేస్తోందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లాలో జరుగుతున్న రైల్వే పనులకు సంబంధించి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో అడవి మామిడిపల్లి, అర్సపల్లి, మాధవ్ నగర్ వద్ద రైల్వే బ్రిడ్జిల నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. అడవి మామిడిపల్లిలో సుమారుగా పనులు పూర్తి కావచ్చాయని, దీనికి సంబంధించిన నిధులను నాటి మంత్రి ప్రశాంత్ రెడ్డి రూ. 17 కోట్లను ఇతర పనులకు మళ్లించారని పేర్కొన్నారు. దీనివల్లనే పనులలో ఆలస్యం అన్నారు. మాధవ నగర్ బ్రిడ్జి పనులు కొనసాగుతున్నాయని, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూ. 11 కోట్లు కేటాయించవలసి ఉందన్నారు. అర్సపల్లి వద్ద నిర్మించే రైల్వే బ్రిడ్జికి సంబంధించి మొత్తం రూ. 137 కోట్లు కాగా, ఇందులో కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద రూ. 127 కోట్లు కేటాయించిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద రూ. 10 కోట్లు ఇప్పటికీ కేటాయించలేదన్నారు. రైల్వే బ్రిడ్జిల నిర్మాణానికి సంబంధించి వారం రోజుల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిని కలిసి నిధులు విడుదల చేయాలని కోరనున్నట్లు తెలిపారు. జిల్లాలో మిగతా అభివృద్ధి పనులకు సంబంధించి రాష్ట్ర మంత్రులను కలిసి నిధులు వచ్చేలా చూస్తానన్నారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పెండింగ్ బకాయిలను విడుదల చేయించినట్లు తెలిపారు.