
వీడీసీ నిర్మించిన మడిగెలను సీజ్ చేయాలి
నిజామాబాద్ లీగల్: ఆర్మూర్ మండలం సుర్భిర్యాల్ గ్రామంలో పంచాయతీ స్థలం ఆక్రమించడంతోపాటు అనుమతి లేకుండా నిర్మించిన 11 మడిగెలను సీజ్ చేయాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆదేశించారు. సుర్భిర్యాల్ గ్రామంలో ఇటీవల మాదిగ కులానికి చెందిన వ్యక్తులపై వీడీసీ సాంఘిక బహిష్కరణ విధించింది. దీంతో బాధితులు న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఉదయ్ భాస్కర్ రావును ఆశ్రయించారు. వీడీసీ సభ్యులు గ్రామంలోని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమంచి అక్రమంగా 11 షెటర్లను నిర్మించారని, వాటిలో రెండింటిని ఓ అగ్రవర్ణ కుల సంఘానికి అప్పగించారని, అదేవిధంగా తమకు కేటాయించాలని అడుగగా వ్యతిరేకిస్తున్నారని వివరించారు. దీనిపై స్పందించిన సంస్థ కార్యదర్శి ఉదయ్ భాస్కర్ రావు సుర్భిర్యాల్ పంచాయతీ కార్యదర్శి సంధ్యారాణి, ఆర్‌ఐ ప్రమోద్‌లను తన కార్యాలయానికి పిలిపించుకొని సాంఘిక బహిష్కరణకు దారితీసిన పరిస్థితులను తెలుసుకున్నారు. గ్రామంలో కొందరు వ్యక్తులు చట్టానికి అతీతులుగా వ్యవహరిస్తుంటే పైఅధికారులకు నివేదికలు ఇవ్వాల్సింది పోయి వారికి సహకరించడం తగదని అన్నారు.
● జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆదేశం
● సుర్భిర్యాల్ వీడీసీ ఆగడాలపై ఆగ్రహం