
అధికారులు, సిబ్బంది కార్యస్థానాల్లో ఉండాలి
నిజామాబాద్ రూరల్: భారీ వర్ష సూచనల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది కార్యస్థానాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. కార్యస్థానాల్లో ఉండని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిజామాబాద్ రూరల్ మండలం తిర్మన్‌పల్లి, పాల్దా గ్రామాలలో కలెక్టర్ బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తిర్మన్‌పల్లి రైతువేదికను సందర్శించిన కలెక్టర్.. ఏఈవో అందుబాటులో లేకపోవడంపై అసహనం వ్యక్తంచేశారు. రైతు వేదికకు తాళం వేసి ఉండడం, పలువురు రైతులు బయట నిరీక్షిస్తుండడాన్ని గమనించిన కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారి గోవిందుకు ఫోన్ చేసి అక్కడికి పిలిపించారు. అదే సమయంలో ఏఈవో కూడా చేరుకోగా, రైతువేదిక వద్ద అందుబాటులో లేకుండా ఎక్కడికి వెళ్లావంటూ కలెక్టర్ నిలదీశారు. కార్యస్థానాలలో ఉండాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ నిర్లక్ష్యం వహించడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యాధికారులకు సూచించారు. పాల్ద గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనం నాణ్యతను తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణలో ఇంకుడు గుంత నిరుపయోగంగా ఉండడాన్ని గమనించిన కలెక్టర్, దాని నిర్వహణను చక్కబెట్టాలని ఏపీవోను ఆదేశించారు. పాఠశాలకు 30 మంది విద్యార్థులు హాజరుకాగా, ముఖ గుర్తింపు విధానం ద్వారా 25 మంది హాజరు మాత్రమే ఆన్‌లైన్‌లో నమోదు చేయడాన్ని గమనించిన కలెక్టర్, మిగతా విద్యార్థులు ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు విషయమై హెచ్‌ఎం సుమన్ రెడ్డిని ప్రశ్నించారు. సాంకేతిక కారణాలతో నమోదు కాలేదని హెచ్‌ఎం తెలుపగా, కలెక్టర్ తన సమక్షంలో విద్యార్థులు హాజరును ఎఫ్‌ఆర్‌ఎస్ విధానంలో నమోదు చేయించారు. ఎఫ్‌ఆర్‌ఎస్ నమోదులో సాంకేతిక సమస్యలు తలెత్తితే ఎవరిని సంప్రదించాలనే విషయమై జిల్లాలోని అన్ని పాఠశాలల హెచ్‌ఎంలకు టెక్నికల్ పర్సన్ ఫోన్ నెంబర్, తదితర వివరాలతో కూడిన సమాచారాన్ని చేరవేయాలని ఫోన్ ద్వారా డీఈవోను ఆదేశించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. సహకార సంఘం ఎరువుల గిడ్డంగిని తనిఖీ చేశారు. రైతులకు పూర్తిస్థాయిలో యూరియా, ఇతర ఎరువులను అందజేసినట్లు సొసైటీ సీఈవో రాకేశ్, కలెక్టర్ దృష్టికి తెచ్చారు. మరింత అందుబాటులో ఉంచేందుకు వీలుగా 10 టన్నుల వరకు ఎరువుల కోసం ఇండెంట్ పంపినట్లు తెలిపారు. పాల్ద గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, నర్సరీల నిర్వహణ, మొక్కల పెంపకం తదితర అంశాలపై పంచాయతీ కార్యదర్శిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
నిజామాబాద్ రూరల్‌లో
ఆకస్మిక తనిఖీలు
తిర్మన్‌పల్లి ఏఈవోపై ఆగ్రహం