రుణ మాఫీ కొందరికేనా! | - | Sakshi
Sakshi News home page

రుణ మాఫీ కొందరికేనా!

Aug 13 2025 9:27 PM | Updated on Aug 13 2025 9:27 PM

రుణ మాఫీ కొందరికేనా!

రుణ మాఫీ కొందరికేనా!

మోర్తాడ్‌ మండలం సుంకెట్‌కు చెందిన రైతు ఆరెపల్లి గంగాప్రసాద్‌కు ఎస్‌బీఐలో రూ.50వేల రుణం ఉంది. అతని పేరిట రెండు ఖాతాలు ఉన్నాయని ఆన్‌లైన్‌లో చూపడంతో రుణమాఫీ సొమ్ము జమకాలేదు. వాస్తవానికి సదరు రైతుకు ఒక్కటే రుణ ఖాతా ఉంది. బ్యాంకర్ల తప్పిదంతోనే గంగాప్రసాద్‌ పేరిట రెండు ఖాతాలు ఉన్నాయి. దీంతో ఏ విడతల్లోనూ గంగాప్రసాద్‌కు రుణమాఫీ వర్తించలేదు. బ్యాంకు ఖాతాను సరిచేసి రుణమాఫీ సొమ్మును జమ చేయాల్సి ఉండగా ప్రభుత్వం నిధులను విడుదల చేయకపోవడంతో అతనికి నిరాశే మిగిలింది.

సుంకెట్‌కు చెందిన మరో రైతు సాయిరాంకు వేల్పూర్‌ మండలం రామన్నపేట్‌ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రూ.2.45లక్షల రుణం ఉంది. మాఫీ సొమ్ము పరిమితి కంటే ఎక్కువ రుణం ఉండటంతో సాయిరాంకు మాఫీ వర్తించలేదు. తన బకాయిలో రూ.45వేలను చెల్లించడానికి సాయిరాం సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం నుంచి సరైన సమాచారం లేకపోవడంతో రుణమాఫీకి అర్హుడు కాలేకపోయాడు. ఇది ఒక్క గంగాప్రసాద్‌, సాయిరాంలకు ఎదురైన సమస్యనే కాదు. రూ.2లక్షల వరకు పంట రుణం బకాయి ఉన్న అనేక మంది రైతులకు కలిగిన అసౌకర్యం.

మోర్తాడ్‌(బాల్కొండ): తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన రైతులు అందరికీ రూ.2లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేస్తామని రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఎన్నికల్లో అనుకున్నట్లుగానే కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ పథకాన్ని అమలు చేసింది. కానీ రెండేళ్లు దగ్గరపడుతున్నా రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం రుణమాఫీ ఊసెత్తకపోవడంతో అర్హులైన అనేక మంది రైతుల ఆశలు ఆవిరి అవుతున్నాయి.

జిల్లాలో 97,696 మందికి..

రాష్ట్ర ప్రభుత్వం నాలుగు విడతల్లో రుణమాఫీ అమలు చేయగా, జిల్లాలోని 97,696 మంది రైతులు లబ్ధిపొందారు. వారికి సుమారు రూ.755 కోట్ల, 29 లక్షల, 40వేలు మాఫీ సొమ్ము ఖాతాల్లో జమ చేశారు. అప్పట్లో ప్రభుత్వం జిల్లాకు సంబంధించి 1,00,612 మంది రైతులకు రూ.782.30 కోట్ల నిధులు రుణమాఫీ కోసం విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. 2,916 మంది రైతుల వివరాలు సరిగా లేకపోవడంతో రూ.27.01కోట్ల మాఫీ సొమ్ము తగ్గిపోయింది. ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఒక కుటుంబానికి రూ.2లక్షల రుణం మాఫీ చేయాల్సి ఉంది. ఈ లెక్కన జిల్లాలో రుణమాఫీకి అర్హులైన వారి సంఖ్య ఇంకో 50వేల వరకూ ఉంటుందని అంచనా. రుణమాఫీకి అవసరమైనన్ని నిధులను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో తూతూ మంత్రంగానే రుణాలు మాఫీ అయ్యాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గత ప్రభుత్వంలోనూ నిరాశే...

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనూ రుణమాఫీపై అనేక మంది రైతులు ఆశలు వదులు కోవాల్సి వచ్చింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జిల్లాలో రుణమాఫీ లక్ష్యం రూ.1790 కోట్లు కాగా 2,91,188 మంది రైతులకు మాఫీ సొమ్ము జమ చేయాలని నిర్ణయించారు. అప్పట్లోనూ నిధుల కేటాయింపు సరిగా జరగకపోవడంతో కేవలం 97,418 మంది రైతులకు రూ.490.72 కోట్లు మాత్రమే మాఫీ జరిగింది. ఇప్పటికై నా కాంగ్రెస్‌ ప్రభుత్వం స్పందించి అర్హత ఉండి రుణమాఫీ పొందని రైతులకు మాఫీ ఫలాలు అందించాలని పలువురు కోరుతున్నారు.

మాట తప్పడం సరికాదు..

ప్రభుత్వం రుణమాఫీ విషయంలో మాట తప్పడం సరికాదు. నిధులను కేటాయించి రైతులను రుణ విముక్తులను చేయాలి. గత ప్రభుత్వం మాదిరిగా ఈ ప్రభుత్వం కూడా మాట తప్పితే విలువ ఏముంటుంది. రేవంత్‌రెడ్డి సర్కార్‌ రుణమాఫీపై స్పందించాలి. – సల్ల రాజేశ్వర్‌, రైతు, తొర్తి

రైతులకు అండగా నిలవాలి..

రుణం మాఫీ అవుతుందనే ఆశతో ఎంతో మంది రైతులు సకాలంలో రుణాలను రెన్యూవల్‌ చేసుకోక బ్యాంకుల దృష్టిలో డిఫాల్టర్లుగా ఉండిపోయారు. రుణమాఫీ సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేసి సీఎం రేవంత్‌రెడ్డి అన్నదాతలకు అండగా నిలవాలి. – మాదాం చిన్న నర్సయ్య, రైతు, తొర్తి

స్పష్టత రావాల్సి ఉంది

గతంలో రుణ మాఫీ అయిన రైతుల సమాచారం మాత్రమే వ్యవసాయ శాఖ వద్ద ఉంది. నిధుల విడుదల విషయంపై మాకు ఎలాంటి సమాచారం లేదు. రుణమాఫీపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

– గోవింద్‌, జిల్లా వ్యవసాయాధికారి, నిజామాబాద్‌

రూ.2లక్షల లోపు రుణాలు ఉన్న

రైతులకు మాఫీ చేస్తామంటూ

కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీ

నాలుగు విడతల్లో కొంత మందికే

చేశారని ఆరోపణలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement