
మృత్యువులోనూ కలిసే..
కామారెడ్డి క్రైం: కవలలుగా కలిసి జన్మించారు. మృత్యువులోనూ కలిసే లోకాన్ని వీడిపోయారు. పిల్లలే సర్వస్వంగా బతుకుతున్న ఆ తల్లిదండ్రులకు జరిగిన ఘటన కడుపుకోతను మిగిల్చింది. ఈ విషాదకర ఘటన కామారెడ్డి జిల్లా తిమ్మక్‌పల్లి గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గుర్రాల పెద్ద నర్సింలు, మంజుల దంపతులకు రామ్, లక్ష్మణ్ (13) అనే కవలలు ఉన్నారు. స్థానికంగా ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలలో 8 వ తరగతి చదువుకుంటున్నారు. రోజూ మాదిరిగానే సోమవారం సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన వారిద్దరూ బ్యాగులు ఇంట్లో పెట్టి ఆడుకునేందుకు బయటకు వెళ్లారు. రాత్రి 10 గంటలైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు వెతకడం మొదలుపెట్టారు. సమీపం లోని కుంట కట్ట పైన పిల్లల బట్టలు కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దేవునిపల్లి పోలీసులు, గ్రామస్తులు అక్కడకు పెద్ద ఎత్తున చేరుకుని కుంటలో గాలింపు చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో ఒకరి మృత దేహం, మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో మరొక బాలుడి మృతదేహలు లభ్యమయ్యాయి. సరదాగా గడిపేందుకు నీళ్ల లోకి దిగి లోతు ఎక్కువగా ఉండటంతో ఈత రాక నీటమునిగి ఉండవచ్చని భావిస్తున్నారు. మృతి చెందిన కవల పిల్లల తండ్రి నర్సింలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని దేవునిపల్లి ఎస్సై రంజిత్ తెలిపారు.
కుటుంబంలో తీరని విషాదం..
గ్రామానికి చెందిన పెద్ద నర్సింలు నిత్యం కామారెడ్డికి వచ్చి రోజువారీ మేసీ్త్ర పనులు చేస్తూ, మంజుల బీడీలు చుడుతూ జీవనం సాగిస్తున్నా రు. 13 ఏళ్ల క్రితం నర్సింలు దంపతులకు కవలలు పుట్టారు. ఇద్దరు కుమారులు ఒకేసారి జన్మించడంతో తరువాత సంతానం వద్దనుకున్నారు. రామ్, లక్ష్మణ్ అనే పేర్లు పెట్టుకుని అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు. పిల్లలే సర్వస్వంగా ఉన్నదాంట్లో సంతోషంగా బతుకుతున్నారు. ఉన్న ఇద్దరు పిల్లలు ప్రమాదవశాత్తు చనిపోవడం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. తల్లిదండ్రులు, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు.
కుంటలో పడి కవలల దుర్మరణం
కామారెడ్డి మండలం
తిమ్మక్ పల్లిలో ఘటన