
తెయూలో ముగిసిన తీజ్ ఉత్సవాలు
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో 9 రోజులుగా నిర్వహిస్తున్న తీజ్ ఉత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి. బంజార ఆడబిడ్డలు 9 రోజులు ఉపవాసదీక్షలు పాటించి తీజ్ పై భోగ్ బండార్‌తోపాటు మూడు పూటలు నీళ్లు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సేవాలాల్ మహరాజ్ చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి గోధుమ మొలకల బుట్టలను ఊరేగింపుగా తీసుకెళ్లి చెరువులో నిమజ్జనం చేశారు. ఈసందర్భంగా బంజారా విద్యార్థినులు చేసిన సంప్రదాయ నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో తెయూ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ మామిడాల ప్రవీణ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ శాంతాబాయి, కాంట్రాక్టు అధ్యాపకులు కిరణ్‌రాథోడ్, గిరిజన శక్తి విద్యార్థి సంఘం అధ్యక్షుడు శ్రీనురాథోడ్, ఎన్‌ఎస్‌ఎస్‌యూ అధ్యక్షులు సాగర్ నాయక్, బోధనేతర సిబ్బంది బికోజి, నరేష్, మహావీర్, పూజారి రమేష్ గిరి మహరాజ్ తదితరులు పాల్గొన్నారు.