
కౌలు ధర.. తగ్గేదేలే!
న్యూస్‌రీల్
– 8లో u
మంగళవారం శ్రీ 12 శ్రీ ఆగస్టు శ్రీ 2025
● సన్నధాన్యానికి బోనస్ నేపథ్యంలో వరి సాగుకు మరింత మొగ్గు
● రూ.25 వేల నుంచి రూ.50 వేలకు
పెరిగిన ఏడాది కౌలు
● తీసుకునేందుకు పట్టాదారులు,
ఇచ్చేందుకు కౌలు రైతుల ఉత్సాహం
● జిల్లాలో సుమారు 45 వేల మంది కౌలు రైతులు.. 1లక్ష ఎకరాల్లో ధాన్యం సాగు
సన్న ధాన్యం సాగు చేస్తే ప్రభుత్వం బోనస్ ఇస్తుండడంతో కౌలు ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఎకరం కౌలు ధర రూ.25 వేల నుంచి ఏకంగా రూ.50వేల వరకు చేరింది. ప్రాంతాన్ని బట్టి భూ యజమానులు కౌలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ కౌలు రైతులు వెనుకడుగు వేయడం లేదు. బోనస్ లెక్కలు వేసుకుని కౌలు చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: సన్నధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తున్న నేపథ్యంలో వరి పంటకు సంబంధించి కౌలు ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. జిల్లాలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోవిధంగా కౌలు ధరలు ఉన్నాయి. బాన్సువాడ నియోజకవర్గంలో గతంలో ఏడాదికి ఎకరానికి రూ.30వేల చొప్పున ఉన్న కౌలు ఈ ఏడాది రూ.50వేల వరకు పెరిగింది. ఇక బాన్సువాడ నియోజకవర్గం మినహా మిగిలిన నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో ఏడాదికి ఎకరం వరి పంట వేసేందుకు కౌలు ధర రూ.25 వేలు ఉండగా ఈ ఏడాది అది రూ.40 వేలకు చేరింది. బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని, రుద్రూర్ తదితర ప్రాంతాల్లో వరి ఎకరానికి సగటున 40 బస్తాల వరకు దిగుబడి వస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో సగటున 30 బస్తాల వరకు దిగుబడి వస్తోంది. దీంతో ఆయా ప్రాంతాలను బట్టి కౌలు ధరల్లో మార్పు ఉంటోంది.
● బోనస్ ఇస్తున్న నేపథ్యంలో రైతులు కౌలుదార్లకు ఇచ్చేందుకు ధరలు పెంచుతున్నారు. అయితే కౌలు రైతులు సైతం అదనంగా కౌలు చెల్లించేందుకు మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో సగటున ఎకరానికి రూ.15 వేల వరకు బోనస్ వస్తోంది. అంటే వానాకాలం, యాసంగి రెండు పంటలకు కలిపి రూ.30 వేలు బోనస్ రూపంలో దక్కుతోంది. దీంతో ఒక పంట బోనస్ పెరిగిన కౌలు కింద చెల్లిస్తే మరో పంట బోనస్ తమకు అదనంగా కలసి వస్తుందని కౌలు రైతులు లెక్కలు వేసుకుని పెరిగిన కౌలును చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు.
● జిల్లాలో పంటలు సాగు చేసే భూమి 5.60 లక్షల ఎకరాలు ఉంది. 2.72 లక్షల మంది రైతులు ఉన్నారు. అయితే జిల్లాలో సుమారు 45 వేల మంది రైతులు 1 లక్షకు పైగా ఎకరాల్లో కౌలు వ్యవసాయం చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా ఎకరం వరి పంట సాగుకు సంబంధించి దుక్కి దున్నడం, విత్తనాల కొనుగోలు, దమ్ము చేయడం, ఎరువులు, మందుల కొనుగోలు, వరినాట్లు, కలుపుతీత కూలీ, వరికోత, ధాన్యాన్ని కల్లాలకు తరలించడం, హమాలీ చార్జీ లు, బోరు మరమ్మతులన్నీ కలిపి ఒక పంటకు రూ.25 వేలకు పైగా ఖర్చు వస్తోంది. కౌలు డబ్బు లు, పెట్టుబడి ఖర్చులు పోగా ఎకరానికి రూ. లక్షకు పైగా రాబడి వస్తోందని కౌలు రైతులు చెబుతు న్నా రు. ఇదిలా ఉండగా గడిచిన యాసంగికి సంబంధించి ఇప్పటివరకు బోనస్ రైతులకు చెల్లించలేదు. దీంతో రైతుల్లో కొంతమేర గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో పట్టాదారులు, కౌలు రైతులు వివిధ రకాల అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు.
న్యూస్‌రీల్

కౌలు ధర.. తగ్గేదేలే!