ఉత్సాహమేదీ...? | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహమేదీ...?

Aug 12 2025 11:06 AM | Updated on Aug 13 2025 7:18 AM

ఉత్సాహమేదీ...?

ఉత్సాహమేదీ...?

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): వన మహోత్సవాన్ని ఈ ఏడాది అధికారులు పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. వర్షాకాలం మొదలై రెండు నెలలు కావొస్తున్నా జిల్లాలో అంతంత మాత్రంగానే మొక్కలు నాటారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నా ప్లాంటేషన్‌ పుంజుకోవడం లేదు. ఫీల్డ్‌ అసిస్టెంట్ల నుంచి మొదలుకొని జిల్లా అధికారుల వరకు వన మహోత్సవాన్ని లైట్‌గా తీసుకుంటున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. మొక్కలు నాటడంలో కీలకంగా వ్యవహరించాల్సిన గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్సాహన్ని ప్రదర్శించడం లేదు. గ్రామీణాభివృద్ధి శాఖ ఇప్పటి వరకు సగం లక్ష్యాన్నే చేరుకుంది. 2025–26 సంవత్సరంలో 16.84లక్షల మొక్కలు నాటడం లక్ష్యంగా మండలాలకు టార్గెట్లు ఇచ్చింది. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో 3,178 మొక్కలు నాటించాలని లక్ష్యాన్ని నిర్ధేశించారు. అందుకనుగుణంగా జీపీ నర్సరీల్లో మొక్కలను భారీగా పెంచారు. అయితే మొక్కలు బాగా నాటుకోవాలంటే జూలై, ఆగస్టు నెలల్లో ప్లాంటేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలి. కానీ, మొదట్లో వర్షాల్లేక మొక్కలు నాటలేదు. ఇప్పుడు గత నెల రోజులుగా వర్షాలు కురుస్తున్నా కూడా మొక్కలను వేగంగా నాటడం లేదు. భారీగా గుంతలు తవ్వించి మొక్కలు నాటించేందుకు ఉపాధి కూలీలను పిలవడం లేదు. వచ్చిన వారితోనే నెట్టుకొస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 879 ప్రాంతాల్లో 8.87లక్షల మొక్కలను (లక్ష్యంలో 52.66శాతం) మాత్రమే నాటారు. 7.97లక్షల మొక్కలు నాటాల్సి ఉంది.

సగం మండలాల్లో..

మండలాల వారీగా లక్ష్యాలు నిర్ధేశించగా జిల్లాలో సగం మండలాల్లో వన మహోత్సవం కార్యక్రమం నెమ్మదిగా సాగుతోంది. నవీపే ట్‌, ఇందల్వాయి, ధర్పల్లి, నందిపేట్‌, డిచ్‌పల్లి మండలాల్లో కనీసం 40శాతం కూడా లక్ష్యాన్ని చేరుకోలేదు. సిరికొండ, ఎడపల్లి మండలాలు 50శాతం దాటకపోగా... చందూర్‌, మోస్రా, రుద్రూర్‌, భీమ్‌గల్‌, వేల్పూర్‌, కమ్మర్‌పల్లి, మాక్లూర్‌ మండలాలు 50 శాతాన్ని మాత్రమే దాటాయి. జిల్లాలో జక్రాన్‌పల్లి మండలం 95.83శాతం, మోర్తాడ్‌ మండలాలే 92.83 శాతం మొక్కలు నాటి ముందు లక్ష్యానికి అడుగు దూరంలో ఉన్నాయి. మిగతా మండలాలు 55–65 శాతం మధ్యలో ఉన్నాయి. మొక్కలు నాటే విషయంలో వెనుబడ్డ మండలాలు, గ్రామ పంచాయతీలపై దృష్టి పెట్టని అధికారులు, అక్కడ పని చేస్తున్న ఉపాధిహామీ సిబ్బందిని అధికారులు మందలించడానికి కూడా ముందుకు రావడం లేదు.

నెమ్మదించిన వన మహోత్సవం

నామమాత్రంగానే మొక్కలు

నాటిస్తున్న అధికారులు

ఇప్పటి వరకు సగం లక్ష్యాన్నే

చేరుకున్న గ్రామీణాభివృద్ధి శాఖ

వర్షాలు కురుస్తున్నా

కనిపించని పురోగతి

దృష్టి పెడతాం

లక్ష్యానికనుగుణంగా మొక్క లు నాటేందుకు చర్యలు చేపడుతున్నాం. కొంత వెనుకబడినా వేగవంతం చేస్తాం. పురోగతి కనిపించని మండలాలు, గ్రామాలపై దృష్టి సారిస్తాం. అక్కడి సిబ్బందితో రోజువారీగా సమీక్షించి మొక్కలు నాటిస్తాం. నిర్లక్ష్యం చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం.

– సాయాగౌడ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement