
నిరాశాజనకంగా నిజాంసాగర్
నిజాంసాగర్: ఉమ్మడి జిల్లా వరప్రదాయిని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టు వెలవెలబోతోంది. దీంతో ఆయకట్టు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వరుణుడు కరుణిస్తే తప్ప ఆయకట్టు గట్టెక్కే పరిస్థితులు కనిపించడం లేదు. నిజాంసాగర్ ప్రాజెక్టు కింద అలీసాగర్ రిజర్వాయర్ వరకు 1.15 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రధాన కాలువకు ఇరువైపులా మోటార్లు ఏర్పాటు చేసి మరో 15 వేల ఎకరా ల వరకు అనధికారికంగా పంటలు పండిస్తున్నారు.
రెండు విడతల్లో 1.58 టీఎంసీలు..
ఈ సీజన్‌లో నిజాంసాగర్ ఆయకట్టుకు ఇప్పటివరకు రెండు విడతల్లో 1.58 టీఎంసీల నీటిని విడుదల చేశారు. జూన్ 25 నుంచి జూలై 9 వరకు మొదటి దఫాలో 0.766 టీఎంసీల నీరందించారు. అదేనెలలో 15 నుంచి 23 వరకు రెండో దఫాలో 0.814 టీఎంసీల నీరు విడుదల చేశారు. అయితే వర్షాకాలం ఆరంభం నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టులోకి 1.224 టీఎంసీల నీరు మాత్రమే వచ్చి చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 5.203 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇందులో డెడ్ స్టోరేజీలో 0.9 టీఎంసీ ఉంటుంది.
ఎగువనుంచి ఆశలు అంతంతే..
ఎగువన సింగూరు ప్రాజెక్టుతోపాటు కొండపోచమ్మ, మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లు ఉన్నాయి. సింగూరు ప్రాజెక్టు హైదరాబాద్ ప్రాంతంతోపాటు మిషన్ భగీరథ గ్రిడ్‌కు తాగు నీటి సరఫరాకు పరిమితమైంది. సింగూరు ప్రాజెక్టులో ప్రస్తుతం 20 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. కొండ పొచ మ్మ, మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లలో నీటి నిల్వలు నిరాశాజనకంగా ఉండడంతో నిజాంసాగర్ ప్రాజెక్టుకు నీరు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. వర్షాల కారణంగా ప్రస్తుతానికి ప్రాజెక్టులోకి స్వల్ప ఇన్‌ఫ్లో వస్తోంది. పంటలు గట్టెక్కాలంటే నాలుగు తడులైనా నీరివ్వాల్సి ఉంటుందని, కానీ ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటితో నాలుగు తడులు ఇవ్వలేమని ఇరిగేషన్ సీఈ శ్రీనివాస్ అంటున్నారు.
అలీసాగర్ వరకు 1.3 లక్షల
ఎకరాల్లో పంటల సాగు
పంటలు గట్టెక్కాలంటే
మరో నాలుగు తడులు అవసరం
వెలవెలబోతున్న ప్రాజెక్టు..
వరుణుడి కరుణపైనే ఆశలు