ధర్పల్లి: మండలంలోని హోన్నాజిపేట్ గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన ధ్యాప పెద్ద నర్సయ్య (60)కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఇటీవల ఆయన కొత్తగా ఇంటిని నిర్మించుకున్నారు. ఇంటి నిర్మాణానికి అప్పులు కావడంతోపాటు తన మూడో కుమార్తెకు ఆరోగ్యం బాగాలేక వివాహం కావడంలేదు. దీంతో పెద్ద నర్సయ్య మనస్థాపానికి గురై ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య కొమరవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామకృష్ణ పేర్కొన్నారు.
ఇష్టం లేని పెళ్లి చేయడంతో యువతి
బాన్సువాడ రూరల్: మండలంలోని కొల్లూర్ గ్రామంలో ఇష్టం లేని పెళ్లి చేయడంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. బాన్సువాడ సీఐ మండలి అశోక్ తెలిపిన వివరాలు ఇలా.. కొల్లూర్ గ్రామానికి చెందిన వల్లెపు లక్ష్మికి ఫిబ్రవరి 23న అదే గ్రామంలో ఉంటున్న దగ్గరి బంధువైన వెంకటేష్ అనే యువకుడితో వివాహం జరిగింది. కాగా లక్ష్మికి వివాహం ఇష్టంలేక మంగళవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించి ఆమెను బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతురాలి తల్లి చంద్రకళ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.