నిజామాబాద్ సిటీ: బడుగు, బలహీనవర్గాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తుందని, ఎన్నికల్లో హామీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలుచేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి చూసి ఓర్వలేని విపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఐదేళ్లలో హామీలు అమలు చేస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే అమలు చేశామని పేర్కొ న్నారు. 50 వేల ఎకరాలకు నీరందించే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన నిధులు కేటాయించాలని సీఎం రేవంత్‌రెడ్డి, ఇరిగేషన్ మంత్రిని కోరినట్లు భూపతిరెడ్డి తెలిపారు. అప్పులు చేసైనా ఇచ్చిన హామీలు అమలుచేసి తీరుతామన్నారు. అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని బడ్జెట్‌లో నిధులు కేటాయించినట్లు తెలిపారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో బీజేపీ కేంద్రమంత్రులు విఫలమయ్యారని అన్నారు. తెలంగాణకు నిధులను రాకుండా బీజేపీ మంత్రులు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీసీసీ డెలిగేట్ బాడ్సి శేఖర్‌గౌడ్, నాయకులు భూమారెడ్డి, రమేశ్, లింగం తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధిని ఓర్వలేకే విమర్శలు
రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి