ఖలీల్‌వాడి: జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీతా కుంచాలను నిజామాబాద్ కోర్టు కార్యాలయంలో సీపీ పోతరాజు సాయిచైతన్య గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూలమొక్కను అందజేశారు.
సీపీని కలిసిన
ప్రొబెషనరీ ఎస్సైలు
ఖలీల్‌వాడి: నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పోతరాజు సాయిచైతన్యను ఎనిమిది మంది ప్రొబెషనరీ ఎస్సైలు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూలమొక్కను అందజేశారు. సీపీని కలిసిన వారిలో ప్రొబెషనరీ ఎస్సైలు సుస్మిత, సుహాసిని, కళ్యాణి, రమ, రాజేశ్వర్, కిరణ్ పాల్, శైలేందర్, శ్రీనివాస్ ఉన్నారు.
వీడీసీపై ఫిర్యాదు
బాల్కొండ: మెండోరా మండలం సావెల్ గ్రామంలో తమను వీడీసీ బహిష్కరించిందంటూ గురువారం రెండు కులాల సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామశివారులోని వాగు నుంచి ఇంటి నిర్మాణాలకు ఇసుకను తెచ్చుకుంటే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ విషయమై ఎస్సై నారాయణను ‘సాక్షి’ వివరణ కోరగా.. సమస్య పరిష్కారానికి చర్చలు జరుపుతున్నామని, శుక్రవారం గ్రామాన్ని సందర్శించి పూర్తిస్థాయి విచారణ చేపడతామని తెలిపారు.
ఆఫీసర్ లోపల..
బయట తాళం
● ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌కు తాళం వేసిన మతిస్థిమితం లేని వ్యక్తి
కామారెడ్డి టౌన్: ప్రభుత్వ అతిథి గృహంలో అధికారి విశ్రాంతి తీసుకుంటుండగా, మతిస్థితిమితం లేని వ్యక్తి బయట నుంచి తాళం వేసి వెళ్లిన ఘటన గురువారం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. కామారెడ్డి ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో బుధవారం రాత్రి విద్యుత్ శాఖకు సంబంధించిన ఒక అధికారి విశ్రాంతి తీసుకున్నారు. గెస్ట్‌హౌస్ సిబ్బంది వస్తే ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు లోపల నుంచి గొళ్లెం పెట్టకుండా తాళం సోఫాపై పెట్టి విశ్రాంతి తీసుకున్నారు. గురువారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు పైఅంతస్తులోకి వెళ్లగా అదే సమయంలో ఓ మతిస్థిమితం లేని వ్యక్తి నేరుగా గెస్ట్‌హౌస్ లోపలికి వచ్చి సోఫాపై ఉన్న తాళం తీసుకుని డోర్‌కు తాళం వేసి వెళ్లిపోయాడు. కాసేపటికి కిందికి వచ్చిన అధికారి.. డోర్‌కు బయటి నుంచి తాళం వేసి ఉండడంతో కంగుతిన్నారు. సిబ్బందికి ఫోన్ చేయగా, సుమారు గంటపాటు శ్రమించి తాళం తీశారు.
జిల్లా జడ్జిని కలిసిన సీపీ
జిల్లా జడ్జిని కలిసిన సీపీ


