రైతులకు ఇబ్బందులు ఎదురవ్వొద్దు | - | Sakshi
Sakshi News home page

రైతులకు ఇబ్బందులు ఎదురవ్వొద్దు

Mar 20 2025 2:40 AM | Updated on Mar 20 2025 2:38 AM

సుభాష్‌నగర్‌: జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు గురువారం నుంచి రైతులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు తెలిపారు. రబీ సీజన్‌ ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో బుధవారం ఆయా శాఖల అధికారులు, పీఏసీఎస్‌ ల సీఈవోలు, ఐకేపీ సీసీలు, మెప్మా ప్రతినిధులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేలా సంబంధిత అధికారులు, కేంద్రాల నిర్వాహకులు అంకితభావంతో కృషి చేయాలన్నారు. రైతులకు ఏ దశలోనూ ఇబ్బందులు తలెత్తకుండా నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో క్వింటాల్‌ ‘ఏ’ గ్రేడ్‌ ధాన్యానికి రూ.2,320, సాధారణ రకానికి రూ.2,300 మద్దతు ధర చెల్లించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. సన్నాలకు మద్దతుధరతోపాటు క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్‌ చెల్లించనున్నట్లు తెలిపారు.

సేకరణ లక్ష్యం 9లక్షల మెట్రిక్‌ టన్నులు

యాసంగి సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా లక్షా 69వేల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో రైతులు వరి సాగు చేశా రని కలెక్టర్‌ తెలిపారు. 11.85 లక్షల మెట్రిక్‌ టన్ను ల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా కాగా, 9 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించడం లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ఇందులో 6.80 లక్షల మెట్రిక్‌ టన్నులు సన్న, 2.20 లక్షల మెట్రిక్‌ టన్నుల దొడ్డు రకం ఉంటుందని వివరించారు.

కొనుగోలు కేంద్రాలు 664

జిల్లాలో 664 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, వీటిలో సన్న ధాన్యం సేకరణకు 472, దొడ్డు ధాన్యం సేకరణకు 192 కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉంటాయని కలెక్టర్‌ వివరించారు.

సమావేశంలో అదనపు కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌, బోధన్‌ సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మహతో, ఆర్డీవోలు రాజేంద్రకుమార్‌, రాజాగౌడ్‌, జెడ్పీ సీఈవో సాయాగౌడ్‌, సివిల్‌ సప్లయీస్‌ డీఎం శ్రీకాంత్‌రెడ్డి, డీసీవో శ్రీనివాస్‌, మెప్మా పీడీ రాజేందర్‌, డీఏవో వాజిద్‌ హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

సన్నాలకు రూ.500 బోనస్‌

నేటి నుంచి అందుబాటులోకి

ధాన్యం కొనుగోలు కేంద్రాలు

నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు

సన్నాహక సమావేశంలో కలెక్టర్‌

రాజీవ్‌గాంధీ హనుమంతు

పకడ్బందీగా పర్యవేక్షించాలి

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పకడ్బందీగా పర్యవేక్షించాలని అధికారులను కలెక్టర్‌ హనుమంతు ఆదేశించారు. తూకం, తరుగు అంశాల్లో జాగ్రత్తగా ఉండాలని, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు ప్రతిరోజూ కొనుగోలు కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శించాలన్నారు. ధాన్యం సేకరణ వివరాలను వెంటవెంటనే ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేస్తే త్వరితగతిన చెల్లింపులకు అవకాశం ఉంటుందన్నారు. బిల్లుల చెల్లింపుల్లో తప్పిదాలు చేస్తూ, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు. ఆరబెట్టి, శుభపర్చిన ధాన్యాన్ని తీసుకువచ్చేలా రైతులను చైతన్యపర్చాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ధాన్యం రవాణాకు అవసరమైన వాహనాలను అందుబాటులో ఉంచుకుని వెంటవెంటనే మిల్లులకు తరలించాలన్నారు. రైతులు దళారులకు ధాన్యం విక్రయించి మోసపోవద్దని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement