తప్పుల తడకగా ముసాయిదా ఓటరు జాబితా
సుభాష్‌నగర్: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ముసాయిదా ఓటరు జాబితా తప్పుల తడకగా ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి ఆరోపించారు. శుక్రవారం మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్‌ను నిలదీశారు. డివిజన్ల వారీగా ఓటరు జాబితా ప్రతులను తీసుకొచ్చి ఇతర జిల్లాలు, రాష్ట్రాల ఓట్లను ఇక్కడ ఎందుకు చేర్చారని ప్రశ్నించారు. అనంతరం దినేశ్ పటేల్ మాట్లాడుతూ ముసాయిదా ఓటరు జాబితాలో సికింద్రాబాద్, బొల్లారం, అల్వాల్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, కరీంనగర్, నాందేడ్, ఇతర ప్రాంతాల ఓటర్లు ఉన్నారని తెలిపారు. 350 పోలింగ్ బూత్‌లు, 60 డివిజన్లలోనూ ఇదే తరహాలో అవకతవకలు జరిగాయని, ఎవరి తప్పిదం వల్ల జరిగిందో తెలియాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ ఒక్కచోట కూడా తప్పిదం జరగలేదని, కానీ కేవలం 3.47లక్షల ఓట్లలో ఇన్ని తప్పిదాలు ఎందుకు జరిగాయన్నారు. 10వ తేదీ తర్వాత ఎవరికీ అడిగే దిక్కు ఉండదని, ఈ విషయమై ఎంపీ అర్వింద్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. 60 వేల ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇందూరులో బీజేపీ గెలుస్తుందనే అధికార కాంగ్రెస్ అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు. త్వరలో కలెక్టర్‌ను కూడా కలుస్తామని, ఎన్నికల కమిషన్, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. కలెక్టర్ బదిలీపై కూడా తమకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే తరహాలో అవకతవకలు జరిగాయని, ఈ ఓటరు జాబితాను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని తెలిపారు. వెంటనే జాబితాను సరిచేయాలని, లేకుంటే అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. కాగా, ముసాయిదా ఓటరు జాబితాలో తప్పులు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ విషయమై బీఎల్‌వోలు, మున్సిపల్ సిబ్బంది సరిచేస్తున్నారని కమిషనర్ దిలీప్‌కుమార్ తెలిపారు. తుది జాబితా గడువులోపు తప్పిదాలను సరి చేస్తామని బీజేపీ నాయకులకు ఆయన హామీనిచ్చారు.
కార్యక్రమంలో నాయకులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, ప్రమోద్‌కుమార్, జ్యోతి, పద్మారెడ్డి, బద్దం కిషన్, సంతోష్, శంకర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, తారక్ వేణు, ఆమంద్ విజయ్, రాజేందర్, హరీశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు
దినేశ్ పటేల్ కులాచారి
ఎన్‌ఎంసీలో బీజేపీ గెలుస్తుందనే
అవకతవకలు
కమిషనర్ దిలీప్‌కుమార్ నిలదీత


