ఆనందాల రంగుల కేళీ.. హోలీ
నిజామాబాద్ రూరల్/ఆర్మూర్: రంగుల కేళీ హోలీ పండుగకు రంగం సిద్ధమైంది. జిల్లావ్యాప్తంగా నేడు పండుగను ఘనంగా జరుపుకునేందుకు ప్రజలు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. నిన్నటి రోజున కాముని దహనం భక్తిశ్రద్ధలతో నిర్వహించగా, శుక్రవారం హోలీ పండుగను ప్రజలు ఉత్సాహంగా జరుపుకొనున్నారు. వసంత రుతువులో వచ్చే తొలి వేడుక ఇది. వసంతగమనాన్ని, కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ పౌర్ణమి రోజు వచ్చే ఈ పర్వదినాన్ని వసంతోత్సవం అని అంటారు. ఈ పండుగ రోజు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ సంతోషంగా జరుపుకొంటారు. హోలీ సందర్భంగా జిల్లాకేంద్రంతోపాటు అన్ని మండలాలు, పట్టణాల్లో రంగుల దుకాణాలు వెలిశాయి. చిన్నారుల కోసం హోలీ గన్స్, గులాలు, పంపులు వంటి వాటిని విక్రయిస్తున్నారు. అలాగే కుడుకల పేర్లు.. చక్కరబెండ్లు విక్రయాలు సైతం జోరుగా కొనసాగుతున్నాయి. హోలీ పండుగను సంప్రదాయం ప్రకారం జరుపుకోవాలని, రసాయన రంగులతో కాకుండా సహజ రంగులు వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. రసాయన రంగులు వాడేసమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. పండుగను ప్రజలు శాంతియుతంగా, సురక్షితంగా జరుపుకోవాలని పోలీసులు, వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
నేడు వేడుకలకు సిద్ధమైన ప్రజలు
మార్కెట్లలో జోరుగా రంగులు, రంగుల పరికరాల విక్రయాలు
ఆనందాల రంగుల కేళీ.. హోలీ
ఆనందాల రంగుల కేళీ.. హోలీ
ఆనందాల రంగుల కేళీ.. హోలీ


