మోర్తాడ్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పని చేస్తున్న గెస్ట్ అధ్యాపకులను రెన్యూవల్ చేసిన మా దిరిగానే డిగ్రీ కళాశాలల్లోని గెస్ట్ ఫ్యాకల్టీని కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ డిగ్రీ కళాశాలల్లోని గెస్ట్ అధ్యాపకులను రెన్యూవల్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. విద్యాశాఖ నిర్ణయంతో ఉమ్మడి జిల్లాలోని 100 మంది గెస్ట్ అధ్యాపకులకు ఊరట లభించింది. గెస్ట్ అధ్యాపకులను కాంట్రాక్టు అధ్యాపకుల మాదిరిగా రెన్యూవల్ చేయకుండా ప్రతి విద్యాసంవత్సరంలో ఇంటర్వ్యూలను నిర్వహించి కొత్తగానే విధుల్లోకి తీసుకునేవారు. ఈ విధానంతో అతిథి అధ్యాపకులకు ఉద్యోగ భద్రత లభించక వారిలో ఆందోళన నెలకొంది. పేరుకే అతిథి అధ్యాపకులమైనా రెగ్యులర్, కాంట్రాక్టు అధ్యాపకుల మాదిరిగానే తాము కూడా కళాశాలల అభివృద్ధికి తోడ్పాటును అందిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని వారు హైకోర్టుకు విన్నవించారు. ప్రతి సంవత్సరంలో మౌఖిక ఇంటర్వ్యూలను నిర్వహించే విధానానికి స్వస్తి పలకాలని హైకోర్టు తలుపు తట్టడంతో న్యాయమూర్తి సానుకూలంగా స్పందించారు. మొదట జూనియర్ కళాశాలల అధ్యాపకులు హైకోర్టును ఆశ్రయించి రెన్యూవల్ ఉత్తర్వులను అందుకున్నారు. వారి మార్గంలో నే డిగ్రీ కళాశాలల అధ్యాపకులు కూడా ఇటీవల హై కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో, అందుకు అనుగుణంగా ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి వాకా టి కరు ణ రెన్యూవల్ ఉత్తర్వులను జారీ చేశారు. ఇటీవల గెస్ట్ అధ్యాపకుల పోస్టుల భర్తీకి ఆయా డిగ్రీ కళాశా లలు నోటిఫికేషన్ జారీ చేశాయి. ఇంటర్వ్యూలను నిర్వహించాల్సి ఉండగా భారీ వర్షాలతో వాయిదా పడింది. చివరకు గతంలో గెస్ట్ అధ్యాపకులుగా పని చేసిన వారినే కొనసాగించాలని ఉత్తర్వులు వెలువడంతో వారికి ఊరట కలిగినట్లు అయింది.
డిగ్రీ కాలేజీల్లోని అతిథి అధ్యాపకులను కొనసాగించాలి
ఉత్తర్వులను జారీ చేసిన ఉన్నత విద్యాశాఖ


