బాసర: రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల ప్రాణాల రక్షణే లక్ష్యంగా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా భైంసా ఏఎస్పీ సాయికిరణ్ ఐపీఎస్ శనివారం బాసర పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రమాదకర ప్రాంతాలను (బ్లాక్ స్పాట్లను) క్షేత్రస్థాయిలో సందర్శించారు. తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలలో ప్రమాదాలకు కారణాలను ఆయన విశ్లేషించారు. ప్రమాదాలకు దారితీస్తున్న రహదారి లోపాలు, ఇతర పరిస్థితులను గుర్తించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలపై అధికారులతో సమీక్షించారు.
ఎన్‌హెచ్ అధికారులతో సమీక్ష..
పరిశీలన అనంతరం ఏఎస్పీ సాయి కిరణ్ నేషనల్ హైవే అథారిటీ అధికారులతో సమీక్ష చేశారు. గుర్తించిన ప్రమాదకర ప్రాంతాల్లో అవసరమైన రోడ్డు భద్రతా చర్యలను త్వరితగతిన చేపట్టాలని సూచించారు. వాహనదారులను అప్రమత్తం చేసేందుకు ప్రమాద హెచ్చరిక బోర్డులు, రహదారి సూచికలను ఏర్పాటు చేయాలని, ఇతర అవసరమైన భద్రతా ఏర్పాట్లను మెరుగుపరచాలని అధికారులను కోరారు.
ముందుచూపుతో రక్షణ..
ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించడం కంటే, ప్రమాదాలకు కారణాలను ముందుగానే గుర్తించి నివారణ చర్యలు చేపట్టడం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చని పేర్కొన్నారు. రహదారి భద్రతపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన పెంపొందిస్తామని చెప్పారు. సంబంధిత ప్రభుత్వ శాఖల సమన్వయంతో ప్రమాదాల నివారణకు నిర్మల్ జిల్లా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ఏఎస్పీ వెంట బాసర ఇన్‌స్పెక్టర్ దీపక్, ఇతర పోలీస్ సిబ్బంది ఉన్నారు.


