ఖానాపూర్: కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న 2027 జనగణనలో బీసీ కులగణనకు ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ప్రకటించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, రైతు డిక్లరేషన్ హామీలను అమలు చేయాలని బహుజన లెఫ్ట్ ఫ్రంట్(బీఎల్‌ఎఫ్) రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ డిమాండ్ చేశారు. ఖానాపూర్ మండలం మస్కాపూర్‌లోని సీఎంఆర్ ఫంక్షన్ హాల్‌లో శనివారం నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో మాట్లాడారు. సామాజిక న్యాయం సాధించేందుకు కులాలవారీ జనాభా వివరాలతోపాటు ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి స్థితిగతులపై సమగ్ర సమాచారం సేకరించాలన్నారు. అక్టోబర్ 23 నుంచి నవంబర్ 2 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే రౌండ్‌టేబుల్ సమావేశాల్లో వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొనాలని కోరారు. బీఎల్‌ఎఫ్ రాష్ట్ర నాయకురాలు సబ్బని లత మాట్లాడుతూ కులగణన ద్వారా వెల్లడయ్యే సామాజిక, ఆర్థిక అసమానతలను తొలగించేందుకు ప్రభుత్వాలు స్పష్టమైన విధానాలు రూపొందించాలని కోరారు. సమావేశంలో ఎంసీపీఐయూ జిల్లా కార్యదర్శి పీటర్, సహాయ కార్యదర్శి భూక్య సురేందర్, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి మంచికంటి లక్ష్మణ్, నవ తెలంగాణ బీడీ యూనియన్ జాయింట్ సెక్రటరీ కే.సంజీవ్, సీపీఐ(ఎంఎల్) నాయకులు మహమూద్, భోజన్న, బీఎల్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి బోదాస్ గణేశ్, నాయకులు పాల్గొన్నారు.


