నిర్మల్‌లో వినాయక నిమజ్జన ఏర్పాట్ల తీరుపై భక్తులు మండిపడుతున్నారు. పట్టణంలోని ప్రధాన కూడలి బుధవార్‌పేట్ నుంచి గాంధీచౌక్ వరకు ఉన్న ప్రధాన రహదారిపై పెద్ద గుంతల్లో కేవలం డస్ట్, కంకర పోసి వదిలేశారు. సాయంత్రం వాహనాల రద్దీతో రోడ్డు మొత్తం దుమ్ము కమ్మేయడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. బీటీ లేదా సిమెంట్‌తో శాశ్వత మరమ్మతులు చేపట్టాల్సి ఉండగా, తాత్కాలికంగా కంకర, మట్టి పోసి చేతులు దులుపుకున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శోభాయాత్రలో భారీ గణేశ్ విగ్రహాలను లారీలు, ట్రాక్టర్లు, ఇతర భారీ వాహనాల్లో తీసుకెళ్తున్నప్పుడు ఈ కంకర, డస్ట్ తేలిపోయి వాహనాలు అదుపు తప్పే ప్రమాదం ఉంది. వర్షం పడితే డస్ట్ కొట్టుకుపోయే అవకాశం ఉంది. మొక్కుబడి పనులు ఎందుకు చేసినట్లు అని పట్టణవాసులు మండిపడుతున్నారు. వినాయకా శోభాయాత్రలో జర పైలం అని దేవుడిని వేడుకుంటున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్ నిర్మల్


