● యంత్రాల అద్దెతో అదనపు ఆదాయం
లక్ష్మణచాంద: మండలంలోని చామన్‌పల్లిలో మహిళా రైతులు అన్నదాతలకు నాణ్యమైన సేవలందిస్తున్నారు. పురుషులకు తామేమీ తక్కువ కాదంటూ ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు. చామనపల్లిలో 2023లో నాబార్డు సహకారంతో మహిళా రైతు ఉత్పత్తిదారుల సంస్థ (ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్)ను ప్రారంభించారు. ఈ సంఘంలో 350మంది బోరిగాం, రాచాపూర్, లక్ష్మణచాంద, చామన్‌పెల్లి, మాచాపూర్, మల్లాపూర్, మునిపెల్లి, చింతల్‌చాంద, తిర్పెల్లి గ్రామాల మహిళా రైతులు సభ్యులుగా ఉన్నారు. ఇందులో ఒకరు చైర్మన్‌గా తొమ్మిదిమంది డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో సభ్యులుగా చేరేవారు రూ.2,200 చెల్లించాలి. ఇందులో రూ.2వేల వాటా మూలధనం కాగా, రూ.200 సభ్యత్వ రుసుం కింద తీసుకుంటున్నారు.
మూడేళ్లలో రూ.46లక్షల టర్నోవర్
ఏటా ఇతర రైతులకూ మేలైన వరి, మొక్కజొన్న, సోయా, పెసర, మినుము విత్తనాలు, యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు, పురుగు మందులు మార్కెట్ ధర కంటే తక్కువకే విక్రయిస్తున్నారు. ఫలితంగా 2023–24లో రూ.8లక్షలు, 2024–25లో రూ.10లక్షలు, 2025–26లో రూ.15లక్షలు, 2026–27లో (ఇప్పటివరకు) రూ.10లక్షల టర్నోవర్ జరిగినట్లు చైర్మన్ మంగశ్రీ తెలిపారు. ఈ సంవత్సరం రూ.కోటి టర్నోవరే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే, ఇప్పటివరకు రూ.3లక్షలతో (సబ్సిడీ పోనూ) పసుపు ఉడికించే యంత్రం, రూ.4.5లక్షలతో (రూ.1.5లక్షల సబ్సిడీ పోనూ) పసుపు పాలీష్ చేసే మిషన్ కొనుగోలు చేశారు. వీటిని లీజ్‌కు ఇచ్చి ఏటా రూ.55వేలు ఆదాయం ఆర్జిస్తున్నారు. వచ్చిన లాభాలతో సంస్థలో పని చేసే సీఈవోకు నెలకు రూ.17వేలు, అకౌంటెంట్‌కు రూ.12వేలు వేతనాలు, రూము రెంట్ రూ.8వేలు.. మొత్తంగా రూ.37వేలు చెల్లిస్తున్నారు.


