నిర్మల్: ‘మూషికా.. ఓ మూషికా.. ఉండ్రాళ్లు ఆరగించి గుర్రు పెట్టావా ఏంటీ.. ఎంత పిలిచినా పలకడం లేదు..’ అంటూ షెడ్డు (మండపం) తగలకుండా కదులుతూ గణనాథుడు పిలుస్తున్నాడు. ‘ఏంది స్వామీ.. ఈ పూట ఏం ముచ్చట..’ అంటూ మూషికుడు కళ్లు నులుముకుంటూ గణనాథుడి వైపు చూశాడు. ‘ఏం లేదు.. ఈ భూలోకవాసులు బాగా మారిపోతున్నారు..’ అని నిట్టూర్చాడు వినాయకుడు. ‘అగో.. ఏమైంది గణనాథ.. ఇంకో రెండురోజులైతే నవరాత్రులు పూర్తిచేసుకుని మనం కై లాసానికే వెళ్లిపోతం కదా.. ఇంకేంటి స్వామి..’ అని మూషికుడు ప్రశ్నార్థకంగా చూశాడు. ‘అది కాదు మూషికా.. ఒకప్పుడు 80–90స్‌లో నవరాత్రులు ఘనంగా చేసేవారు’ అని గణేశుడు చెబుతుండగనే.. ‘ఏం తక్కువ చేస్తున్నరని స్వామీ.. అలా అంటున్నారు..’ అని మూషికుడు ఎదురు ప్రశ్నించాడు. అప్పుడు గణనాథుడు ఇలా ముచ్చట మొదలు పెట్టాడు.
వినాయకుడు: తరం మారినట్లే పండుగలో మార్పులు వచ్చేస్తున్నాయి మూషికా..!
మూషికుడు: డీజేలు, లైట్ల గురించేనా స్వామీ..!
వినాయకుడు: గుండెలు దడదడలాడే డీజేలు ఎందుకు మూషికా? 80లోని భక్తిపాటలు, భజనలు కనిపించడంలేదు.
మూషికుడు: ఇప్పుడు మండపాలు పెద్దవయ్యా యి.. అలాగే, విగ్రహాలు కూడా ఎత్తయ్యాయి గదా స్వామీ..!
వినాయకుడు: నన్ను ఎత్తుగా పెట్టడం కాదు.. భక్తులు మనస్సులో నన్ను ఉన్నతంగా పెట్టుకోవాలి.
మూషికుడు: అంటే.. ఆ పాతకాలపు భక్తి మళ్లీ రావాలంటారా స్వామీ..?
వినాయకుడు: వస్తే తప్పేముంది.. అప్పటి భజ నలో భక్తి ఉండేది. మోగే బ్యాండులో ఉత్సాహం ఉండేది. ఊరేగింపులో అందరి భాగస్వామ్యం ఉండేది. ఇప్పుడు దడదడలాడించే సౌండ్ పెరిగింది.. కానీ ఆత్మీయత తగ్గుతోందనిపిస్తోంది.
మూషికుడు: అర్థమైంది స్వామీ.. ట్రెండ్ మారినా భక్తి మారకూడదన్నమాట!
వినాయకుడు: అందుకే మూషికా.. 80స్ ట్రెండే బాగుండేది. ఎందుకంటే అప్పటి పండుగలో శబ్ధం కంటే భక్తి ఎక్కువగా కనిపించేది, వినిపించేది. అప్పుడే బాగుండే.
మూషికుడు: ఇంతకు.. ఈసారి నిమజ్జనోత్సవానికి మీ సందేశం ఏంటి స్వామీ?
వినాయకుడు: ఒక్కటే మూషికా.. విగ్రహం ఎంత పెద్దది, చిన్నది అనేది ముచ్చట కాదు. భక్తి అంతకంటే పెద్దదై ఉండాలి. డీజే ఎంత తక్కువైనా పర్వాలేదు.. మనసులో ‘వినాయకా’ అనే నామస్మరణ అంతకంటే గట్టిగా వినిపించాలి. నా పండుగ ధ్వని శక్తిని చాటేదిగా కాకుండా.. మనసులో భక్తిని పెంచేదిగా, మనుషుల్లో సమష్టితత్వాన్ని బలపర్చేదిగా ఉండాలన్నదే నా కోరిక.
ఇలా గణనాథుడు, మూషికుడు సంభాషిస్తుండగానే పూజలు చేసేందుకు మండపానికి భక్తుల రాక మొదలైంది. దీంతో మూషిక, గణనాథులు తమ సంభాషణ ముగించేశారు.


