నిర్మల్ బొమ్మలకు ఆదరణ కరువు ప్రపంచ ఖ్యాతి తెచ్చినా కష్టకాలమే అమ్మకాలు లేక కళాకారుల కష్టాలు పరిశ్రమను సందర్శించిన కలెక్టర్ పుష్కరాల్లో స్టాళ్ల ఏర్పాటుకు హామీ
నిర్మల్: ‘మాది నిర్మల్..’ అని జిల్లాకు చెందిన వారెవరైనా అనగానే ‘మీ ఊరు బొమ్మలకు ఫేమస్ కదా..’ అని వెంటనే అంటారు. అంతలా.. నిర్మల్ ను విశ్వవ్యాప్తం చేశాయి కొయ్యబొమ్మలు. ఉట్టిపడే జీవంతో ఆకట్టుకునే కళతో ఎవరినైనా ఇట్టే కట్టిపడేస్తాయి. ఎప్పుడో వందల ఏళ్ల క్రితం నకాషీ కళాకా రుల చేతుల్లో పొనికి కర్రతో ఊపిరి పోసుకున్న ఈ బొమ్మ దశాబ్దాలపాటు తన ఘనత చాటుకుంది. ఇంటి అలంకరణకే పరిమితం కాకుండా.. ప్రత్యేక సందర్భాల్లో ఆత్మీయులకు కానుకగా.. దేశ, విదేశీ పర్యాటకులు ఆసక్తిగా కొనుగోలు చేసే బహుమతి గా ఎదిగింది. ఘనమైన వారసత్వమున్న నిర్మల్ కొ య్యబొమ్మ ఇప్పుడు ఆదరణ కోసం ఎదురుచూస్తోంది. తరతరాలుగా ఈ కళను నమ్ముకుని జీవిస్తు న్న కళాకారులకు గిరాకీ తగ్గడం ఆందోళన కలిగి స్తోంది. కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో లేక కొత్తత రం ఈ వృత్తివైపు రావడానికి ఆసక్తి చూపడం లేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా నిర్మల్‌కు గుర్తింపు తెచ్చి న ఈ కళ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఎంతో మంది కలెక్టర్లు, ఉన్నతాధికారులు ఇచ్చిన హామీలు నీటిమూటలే అయ్యాయి. తాజాగా కలెక్టర్ భవేశ్‌మిశ్రా కూడా కొయ్యబొమ్మల పరిశ్రమను పరిశీ లించి విక్రయాలు పెంచేలా చూస్తానని హామీ ఇచ్చారు.
గిరాకీ తగ్గడంతో..
నిర్మల్ కొయ్యబొమ్మలకు ప్రత్యేకమైన శైలి, నైపుణ్యముంది. స్థానికంగా లభించే పొనికి కర్రతో నకా షీ కళాకారులు ఎంతో నైపుణ్యంతో బొమ్మలకు ప్రా ణం పోస్తారు. రంగులు, ఆకృతులు సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. సంప్రదాయ డిజైన్లతో పాటు ఇటీవలి కాలంలో కొత్తదనాన్నీ సంతరించుకుంటున్నాయి. ఒకప్పుడు బొమ్మల తయారీకి చేతినిండా పని ఉండగా.. ప్రస్తుతం విక్రయాలు తగ్గడంతో కళాకారులకు ఉపాధి కష్టంగా మారుతోంది.
మార్కెటింగ్ ఉంటేనే మనుగడ
కొయ్యబొమ్మలకు దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ కల్పించాల్సిన అవసరముందని కళాకారులు ఎప్పటినుంచో కోరుతున్నారు. ఆన్‌లైన్ విక్రయాలు, పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక విక్రయ కేంద్రాలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రదర్శనలు, బహుమతులుగా వీటినే ఇవ్వడం, ఎగ్జిబిషన్లలో అవకాశాలు కల్పించడం చేస్తే కొంత గిరాకీ పెరిగే అవకాశముంటుంది. కొత్త డిజైన్లు, ఆధునిక అవసరాలకు అనుగుణంగా బొమ్మల ఉత్పత్తులను రూపొందించేందు కు ఆర్థికంగా చేయూతనిస్తూ యువతరానికీ శిక్షణ, డిజైన్ సహకారం అందించాల్సిన అవసరముంది.
ప్రత్యేక కార్యాచరణ అవసరం
నిర్మల్ కొయ్యబొమ్మ కేవలం ఒక ఉత్పత్తి కాదు.. తెలంగాణ సాంస్కృతిక వైభవంలో భాగం. ఈ కళ ను కాపాడేందుకు కళాకారులకు నిరంతర ఉపాధి కల్పించాలి. ముడిసరుకు అందుబాటులో ఉంచాలి. పక్కా మార్కెటింగ్ సదుపాయాలు, శిక్షణ, ఆర్థిక ప్రోత్సాహకాలు అవసరం. ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం, పర్యాటక శాఖ సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణ చేపడితే మినహా.. అంతరించిపోతున్న కళను కాపాడుకోలేని పరిస్థితి. ప్రస్తుతం జిల్లా గ్రా మీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పొనికి వనాలను పెంచడం ఊరట కలిగిస్తున్నా.. మార్కెటింగ్‌పై సర్కారు దృష్టిపెట్టాల్సిన అవసరముంది.
కొయ్యబొమ్మల తయారీలో నైపుణ్యం సంపాదించడానికి ఏళ్లకేళ్లు శిక్షణ అవసరం. పెద్దలు నేర్చుకున్న విద్యను పిల్లలకు నేర్పడం ఆనవాయితీగా కొనసాగేది. ఎప్పు డో నిమ్మలనాయుడు కాలంలో ఈ కళకు పురుడుపోసిన నకాషీ కుటుంబాలే ఈవృత్తిని కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వృత్తిలో ఆదాయం స్థిరంగా లేకపోవడం, ఎదుగుదల కనిపించకపోవడంతో కొత్తతరం యువత ఇతర ఉపాధి మార్గాల వైపు మళ్లింది. ఫలితంగా కొయ్యబొమ్మల తయారీ కుటుంబాల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. కొంతమంది మాత్రమే కళాకారులుగా కొనసాగుతున్నారు. కొంతమంది మహిళలు ఇంటిపట్టున చేసిస్తున్నారు.
తరతరాల కళకు వారసులు కరువు


