భైంసా/బాసర: బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. గోదావరి పుష్కరాల నాటికి ఆలయానికి భవ్యరూపం తీసుకువచ్చేలా అధికారులు చర్యలు చేపట్టారు. రూ.354 కోట్ల ప్రభుత్వ నిధులతో చేపట్టిన పనుల్లో భాగంగా పాత నిర్మాణాల తొలగింపు, నూతన నిర్మాణాల పనులు కొనసాగుతున్నాయి. పుష్కరాలకు ముందే పనులు పూర్తి చేసేలా అధికా రులు ప్రణాళికతో ముందుకెళ్తున్నారు.
దాతల సహకారంతో గర్భగుడి..
ఆలయ గర్భగుడితోపాటు ప్రాకార మండపం, ధ్వ జస్తంభం, మహాకాళి ఆలయం తదితర నిర్మాణాలు చేపట్టేందుకు దాతలు సురపనేని సునంద్–పద్మప్రియ దంపతులు ముందుకువచ్చారు. నిర్ణయించిన గడువు కంటే ముందే నిర్మాణ పనులు పూర్తి చేయాలనే సంకల్పంతో పనులు కొనసాగిస్తున్నారు. ఆలయ గర్భగుడి నిర్మాణానికి అవసరమైన కృష్ణశిలను ఇప్పటికే సిద్ధం చేసి పెట్టారు.
తొలగింపులు.. కొత్త నిర్మాణాలు
ఆలయ సమగ్ర అభివృద్ధిలో భాగంగా ప్రధాన ఆల యం, క్యూ కాంప్లెక్స్, కోనేరు, స్వాగత తోరణం, వంటశాల, ప్రసాదం కౌంటర్లు, డైనింగ్ హాల్, దు కాణా సముదాయాలు, అనుష్ఠాన మండపం, పోలీ స్‌స్టేషన్, ఈవో కార్యాలయం, వీఐపీ గెస్ట్‌హౌస్, గోశాల, పూజారుల క్వార్టర్లు, మరుగుదొడ్లు, వి ద్యుత్ ఉపకేంద్రం, ఎస్టీపీ తదితర సౌకర్యాల కల్ప న, నిర్మాణ పనుల్లో వేగం పెంచారు. ప్రైవేట్ భవనాల విషయంలో అనుమతులు, పరిహారం చెల్లింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.
పుష్కర ఘాట్లకు రూ.20 కోట్లు
వచ్చే ఏడాది జూన్ 27వ తేదీ నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బాసరలో రూ.20 కోట్లతో పుష్కర ఘాట్ల నిర్మాణం, విస్తరణ, మరమ్మతులు, అభివృద్ధి పనులకు ఇటీవలే జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఘాట్లను అభివృద్ధి చేయడంతోపాటు మహిళల కోసం డ్రె స్సింగ్ రూములు, మరుగుదొడ్లు, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయనున్నారు. వైద్యశిబిరాలు నిర్వ హిస్తారు. అంబులెన్స్‌లు, పార్కింగ్, తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు.
గోదావరి తీరంలో 12 ప్రాంతాల్లో వసతులు
బాసరతోపాటు గోదావరి తీరంలోని 12ప్రాంతాల్లో భక్తులకు వసతులు కల్పిస్తున్నట్లు ఇటీవల రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పనులు గడువులోపు నాణ్యతతో పూర్తి చేయించాలని అధికారుల ను ఆదేశించారు. కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆలయ అభివృద్ధి, పుష్కర ఘాట్ల పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అన్ని శాఖల సమన్వయంతో పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.


