● పెంబి ఘటనపై ఖానాపూర్‌లో దళిత సంఘాల ఆదోళన
ఖానాపూర్: పెంబి మండల కేంద్రంలో దళిత మహిళ ఇంటిని కూల్చిన బాధ్యులపై చర్య తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని దళిత, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు ఆదివారం తలపెట్టిన చలో ఖానాపూర్‌లో భాగంగా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆత్మగౌరవ సభ నిర్వహించారు. అంతకుముందు ఎన్టీఆర్ చౌరస్తా నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. దళిత సంఘాల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. బాధిత కుటుంబ సభ్యులతో కలిసి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడే నిర్వహించిన సభలో నాయకులు మాట్లాడారు. దళితుల హక్కులు, ఆత్మగౌరవం, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడాలన్నారు. పెంబిలో బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బ్లూ ఆర్మీ, బహుజన సేన రాష్ట్ర నాయకుడు, వక్త రాజేశ్‌రక్షక్, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూరం అభినవ్, బ్లూ ఆర్మీ రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జరి ప్రకాశ్, భారతీయ సంవిధాన్ ప్రచారక్ దళ్, ఇండిపెండెన్స్ ఫోరం జాతీయ అధ్యక్షుడు రేవు చిన్న ధనరాజ్, ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శైలేందర్, సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల అధ్యక్షుడు నంది రామయ్య, భారత నాస్తిక సమాజం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు బొమ్మిన రాజ్‌కుమార్, అంబేద్కర్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మన రాకేశ్ నాయకులు పాల్గొన్నారు.


