న్యూస్‌రీల్
మహారాష్ట్రలో దైవదర్శనానికి వెళ్లిన పార్డి(బి) గ్రామస్తులు
ఘటన స్థలంలో ముగ్గురు మృతి.. ఆస్పత్రిలో డ్రైవర్..
సంచార తెగల అభ్యున్నతికి కృషి చేయాలి
నిర్మల్‌చైన్‌గేట్: సంచార తెగల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అదనపు కలెక్టర్(రెవెన్యూ) కిశోర్‌కుమార్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంచార జాతుల దినోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. వెనుకబడిన సంచార, విముక్త తెగల అభ్యున్నతికి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. సంచార జాతుల పిల్లలకు నాణ్యమైన విద్యనందించడంతోపాటు యువతకు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వాలు అందించే పథకాలను వినియోగించుకోవాలని పేర్కొన్నారు. సంచార జాతుల సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ సమాజంలో వారి ఆత్మగౌరవం పెంపొందించేందుకు అందరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో రాథోడ్ రమేశ్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
భైంసా/కుభీర్: శ్రావణ సోమవారం సందర్భంగా కుభీర్ మండలం పార్డి(బి) గ్రామానికి చెందిన పది మంది తీర్థయాత్ర విషాదాంతమైంది. పుణ్యక్షేత్రంలో దైవదర్శనం చేసుకుని, పూజలు చేసి.. తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న జీపు మహారాష్ట్రలో తోటంబా ఘాట్ వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. పార్డి(బి) గ్రామానికి చెందిన తూము సాయిలు(60), ఆవుల గంగన్న(63), తూము గౌరాబాయి(70)తోపాటు ఆవుల ప్రేమలబాయి, తూము ముత్తుబాయి, తూముల కిషన్, బ్యారపు మోనాజీ, దొర్లా శంకర్, పుష్ప భాయ్, దనగర్ మల్లయ్య, శంకర్ గ్రామానికే చెందిన తులసీరామ్(27)జీపులో సోమవారం ఉద యం 8 గంటలకు మహారాష్ట్రలోని కై లాస్‌టెకిడి శివా లయ దర్శనానికి బయల్దేరారు. మధ్యాహ్నం వరకు అక్కడకు చేరుకుని పూజలు చేశారు. తిరుగు ప్రయాణంలో సాసర్ కుండ్ జలపాతం వద్దకు వెళ్లారు. తర్వాత స్వగ్రామానికి బయల్దేరారు. తిరుగు ప్రయాణంలో ప్రమాదం జరిగింది. నలుగురు మరణించగా, ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులు కుభీర్, భైంసాలో చికిత్స పొందుతున్నారు.
చివరి ప్రయాణం..
తూము సాయిలు(60)–భార్య ముత్తుబాయితో కలిసి యాత్రకు వెళ్లాడు. వీరికి ఇద్దరు కుమారులు. పెళ్లిళ్లు జరిపించారు. మలి వయసులో కుటుంబంతో ప్రశాంతంగా జీవించాల్సిన దశలో ఆయన పుణ్యక్షేత్ర యాత్రలోనే మృత్యువాత పడ్డాడు. ప్రమాదంలో భార్య ముత్తుబాయి ప్రాణాలతో బయటపడింది. భర్తను కోల్పోయిన ఆమె ఏడుపు అక్కడున్న వారిని కలచివేసింది. ఇక ఆవుల గంగన్న(63)–ప్రేమలబాయి దంపతులు కూడా యాత్రకు వెళ్లారు. ప్రమాదంలో గంగన్న మృతి చెందాడు. ప్రేమలబాయి తీవ్రంగా గాయపడింది. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వీరికి ముగ్గురు పిల్లలు. అందరికీ వివాహం చేశారు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇదే ప్రమాదంలో మృతిచెందిన తూము గౌరాబాయి(70) భర్త మూడేళ్ల క్రితమే మరణించాడు. ఇద్దరు కుమారుల పెళ్లిళ్లు చేసి కుటుంబంతో కలిసి మలిదశ జీవనం సాగిస్తోంది. గ్రామస్తులతో కలిసి పుణ్యక్షేత్రానికి వెళ్లిన ఆమెకు ఈ యాత్రే ఆఖరి ప్రయాణమైంది.
ఊరంతా విషాదం
జీపులో ప్రయాణించిన వారంతా గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొందరు తమ ప్రియమైన వారిని కోల్పోయి, మరికొందరు మంచానికే పరిమితమయ్యారు. ప్రమాద వార్త అందుకున్న వెంటనే గ్రామస్తులు, బంధువులు మహారాష్ట్రకు చేరుకుని మృతదేహాలను భైంసాకు తరలించారు. ఆస్పత్రి వద్ద మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఆస్పత్రిలో రక్షతగాత్రులను ఎమ్మెల్యే రామారావు పటేల్, ఏఎస్పీ సాయికిరణ్, మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి పరామర్శించారు. మృతుల బంధువులను ఓదార్చారు. ఘటనపై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తిరుగు ప్రయాణంలో అదుపుతప్పి బోల్తాపడిన జీపు
చెల్లాచెదురైన క్షతగాత్రులు..
ఘాట్ దిగుతుండగా జీపు అదుపు తప్పి బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్నవారు ఎగిరి రోడ్డుపై పడ్డారు. జీపు టైరు ఊడిపోవడంతో ప్రమాదం జరిగినట్లు కొందరు చెబుతున్నారు. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ప్రమాద స్థలం భీతావాహంగా మారింది. క్షతగాత్రుల రోదనలు విన్న సమీప గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు సహాయం చేశారు. అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. కుటుంబాలకు సమాచారం అందించారు.
చివరి స్టేటస్..
గ్రామానికి చెందిన దాగాం సావిత్రిబాయి, గంగాధర్ దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమార్తెకు వివాహం జరిపించారు. కొడుకు తులసీరామ్‌కు భైంసాకు చెందిన యువతితో గత వేసవిలో వివాహం చేశారు. అందరితో కలిసిమెలిసి ఉండే తులసీరామ్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలిచాడు. ఆదివారం కుటుంబ సభ్యులతో సాసర్ కుండ్‌కు వెళ్లాడు. భార్యతో కలిసి అక్కడ దిగిన ఫొటోను వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకున్నాడు. ఆ ఆనంద దృశ్యాలు చెరిగిపోకముందే విధి వెక్కిరించింది. సోమవారం గ్రామస్తులను జీపులో యాత్రకు తీసుకెళ్లిన తులసీరామ్ తిరుగు ప్రయాణంలోనే ప్రాణాలు కోల్పోయాడు. స్టేటస్ పెట్టి 24 గంటలు కూడా గడవకముందే అతను లేడన్న విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. భైంసా ఆస్పత్రి వద్ద తల్లిదండ్రులు, భార్య, బంధువుల రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి.


