ఆసక్తి ఉన్నవారు పాల్గొనాలి
తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ పోటీల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న ఆసక్తి గల విద్యార్థులు పాల్గొనాలి. ఇందులో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, తెలుగు ఉపాధ్యాయులు విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు కృషి చేయాలి. – భోజన్న, డీఈవో
లక్ష్మణచాంద: పాఠశాల స్థాయి నుంచి విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి ప్రోత్సహించేందుకు తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రత్యేకంగా పోటీలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా బాలల దినోత్సవం సందర్భంగా పలు రకాల రచనాపోటీలు నిర్వహించనున్నారు.
పోటీలు ఇవీ..
తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో కథ, కవిత, గేయం, పాట, పద్యం, నాటిక వంటి వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న 6 నుంచి 10 తరగతుల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులని విద్యా శాఖ అధికారులు తెలిపారు.
పోటీల్లో రాయాల్సిన అంశాలు
తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించే పోటీల్లో పాల్గొనే విద్యార్థులు కింది అంశాలపైనే రాయాలి. ప్రధానంగా తెలంగాణ సంస్కృతి, జీవన విధానం, చారిత్రక ప్రాధాన్యత కలిగిన వ్యక్తులు, భాష వంటి అంశాలపై రచనలు ఉండాలి. కవితలను 26 పంక్తులకు మించకుండా రాయాలి.
పంపాల్సిన చిరునామా
వివిధ అంశాలపై ఆసక్తి ఉన్న విద్యార్థులు తమ రచనలను తెలంగాణ సాహిత్య అకాడమీ, కళాభవన్, రవీంద్రభారతి ప్రాంగణం, హైదరాబాద్ – 500004 అనే చిరునామాకు పోస్టు ద్వారా పంపాలని అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి పేర్కొన్నారు. పోటీకి సంబంధించిన ఇతర వివరాలు, సందేహాల నివృత్తి కోసం 9184245692 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
జిల్లా సమాచారం...
జిల్లాలో మొత్తం ప్రభుత్వ పాఠశాలలు 795
మొత్తం విద్యార్థులు 60,239
జిల్లాలో ప్రైవేటు పాఠశాలలు 227
మొత్తం విద్యార్థులు 69,751
అర్హులైన విద్యార్థులు
6 నుంచి 10వ తరగతి విద్యార్థులు
రచనలు పంపడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30


