నిర్మల్‌ఖిల్లా: జాతి అస్తిత్వానికి, సంస్కృతికి, సంప్రదాయాలకు తెలుగు భాష జీవనాడి అని పలువురు వక్తలు పేర్కొన్నారు. గిడుగు రామమూర్తి పంతులు జయంతి పురస్కరించుకుని జిల్లాకేంద్రంలో నిర్మల్ భారతి సాహిత్య, సాంస్కృతిక, కళా, సామాజిక సేవా క్షేత్రం ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం శనివారం నిర్వహించారు. ప్రియదర్శిని నగర్‌లోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో తెలుగు భాష వైభవాన్ని కొనియాడారు. ఈ సందర్భంగా ‘తెలుగు భాష సంరక్షించబడాలి. తెలుగు వెలుగు విరజిమ్మాలి.. తెలుగు భాషను కాపాడుకోవాలి’ అంటూ నినాదాలు చేశారు. గిడుగు రామమూర్తి పంతులు జీవిత విశేషాలను వివరించారు. నిర్మల్ భారతి అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు తోడిశెట్టి పరమేశ్వర్, బి.వెంకట్ మాట్లాడుతూ..ప్రతి ఒక్కరూ తెలుగులో మాట్లాడాలని పిలుపునిచ్చారు. అనంతరం తెలుగు భాష గొప్పతనాన్ని చాటుతూ కవిసమ్మేళనం నిర్వహించారు. పలువురు కవులు తమ కవితల ద్వారా తెలుగు భాష ఔన్నత్యాన్ని, మాధుర్యాన్ని, విశిష్టతను చాటిచెప్పారు. కార్యక్రమంలో నిర్మల్‌భారతి సమన్వయ కార్యదర్శి అంబటి నారాయణ, కోశాధికారి యార సాయినాథ్‌రెడ్డి, గౌరవ సహాదారు తిరునగరి సురశేఖర్, పాటల తోడిశెట్టి రవికాంత్, చెనిగారపు నాగరాజు, జోసెఫ్ బాబూరావు, కడారి రఘునాథ్, రాజేశ్వర్ తదితర కవులు, కళాకారులు పాల్గొన్నారు.


