కొత్తరూపులో సరస్వతీ క్షేత్రం.. | - | Sakshi
Sakshi News home page

కొత్తరూపులో సరస్వతీ క్షేత్రం..

Aug 28 2026 11:47 PM | Updated on Aug 28 2026 11:47 PM

● అనివేటి మండపానికి భూమిపూజ.. ● టెండర్‌ దక్కించుకున్న ఎన్‌సీసీ ● త్వరలో పనులకు శ్రీకారం

భైంసా: ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞానసరస్వతీ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులు ఇక వేగం పుంజుకోనున్నాయి. భక్తుల చిరకాల ఆకాంక్షకు అనుగుణంగా చేపడుతున్న భారీ అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్‌ ప్రక్రియ పూర్తయింది. దీంతో నిర్మాణ పనులకు మార్గం సుగమమైంది. సుమారు రూ.270 కోట్లతో చేపట్టనున్న ఆలయ పునర్నిర్మాణం, పరిసరాల అభివృద్ధి పనుల్లో భాగంగా అనివేటి మండపం నిర్మాణానికి బుధవారం భూమిపూజ చేశారు. దీంతో బాసర క్షేత్రం కొత్త రూపు సంతరించుకునే ప్రక్రియ మొదలైంది.

ఎన్‌సీసీకి టెండర్‌

ఆలయ పునర్నిర్మాణం, పరిసరాల అభివృద్ధి పనులకు సంబంధించి అధికారులు టెండర్‌ ప్రక్రియను చేపట్టారు. ఈ నెల 17న టెండర్‌కు తుది గడువు ముగియగా పలు సంస్థలు పోటీ పడ్డాయి. ఇందులో నాగార్జున కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ(ఎన్‌సీసీ) టెండర్‌ దక్కించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. త్వరలోనే నిర్మాణ పనులను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

అనివేటి మండపానికి భూమిపూజ

పునర్నిర్మాణంలో కీలకమైన అనివేటి మండపం నిర్మాణానికి బుధవారం వైదిక సంప్రదాయాల ప్రకారం భూమిపూజ నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్‌ పాఠక్‌, ప్రధాన అర్చకులు సంజీవ్‌ పూజారి ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు వేదమంత్రాలతో పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో అంజనీదేవి, ఆలయ అధికారులు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.

భక్తులకు మెరుగైన సౌకర్యాలు

బాసర ఆలయానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ముఖ్యంగా చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు నిత్యం పెద్ద సంఖ్యలో కుటుంబాలు క్షేత్రానికి చేరుకుంటాయి. పర్వదినాలు, వసంత పంచమి, దసరా వంటి ప్రత్యేక సందర్భాల్లో భక్తుల రద్దీ మరింత పెరుగుతుంది. ఈ నేపథ్యంలో పునర్నిర్మాణ పనుల్లో భక్తుల రాకపోకలు, దర్శనం, అక్షరాభ్యాసం, పూజా కార్యక్రమాలకు అనువుగా మౌలిక సదుపాయాలను మెరుగుపరచనున్నారు.

రాజగోపురం.. విస్తరించనున్న

ఆలయ ప్రాంగణం

ఆలయ మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా ఆలయ విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచడంతోపాటు 9 అంతస్తుల రాజగోపురం, ధ్యాన మందిరాలు, భక్తుల వసతికి ఆధునిక కాటేజీలు, రహదారులు, తోరణాలు తదితర అభివృద్ధి పనులను చేపట్టే ప్రణాళిక ఉంది. ఆలయ గర్భాలయం, అనివేటి మండపం, కాళికా అమ్మవారి ఆలయం తదితర ప్రాంతాల అభివృద్ధికి కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

ఆధ్యాత్మిక కేంద్రంగా కొత్త రూపు

శృంగేరి పీఠాధిపతుల మార్గదర్శకత్వంలో రూపొందిన మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం ఆలయ పునర్నిర్మాణం చేపడుతున్నారు. పునర్నిర్మాణం పూర్తయితే బాసర క్షేత్రం కేవలం అక్షరాభ్యాస కేంద్రంగానే కాకుండా భక్తులకు ఆధ్యాత్మిక, ఆహ్లాదకర అనుభూతిని అందించేలా మరింత సుందరంగా రూపుదిద్దుకోనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏప్రిల్‌ 6న ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పనులు పూర్తయితే బాసర జ్ఞాన సరస్వతి క్షేత్రం తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా మరింత ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకునే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement