పునరావాస ప్యాకేజీ కింద రూ.94కోట్లు
రూ.61కోట్ల నిధులు మాత్రమే విడుదల
20ఏళ్లుగా గుండెగాం వాసుల నిరీక్షణ
ఇందిరాపార్క్ వద్ద గ్రామస్తుల నిరసన
భైంసా: పల్సికర్ రంగారావు ప్రాజెక్ట్ ముంపు బాధిత గ్రామమైన గుండెగాం పునరావాస సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడం లేదు. రెండు దశాబ్దాలుగా పునరావాసం కోసం ఎదురుచూస్తున్న 470 కుటుంబాలు తాజాగా హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో ఆందోళన చేపట్టాయి. ప్రాజెక్ట్ కారణంగా వ్యవసాయ భూములు, ఇళ్లు, ఇళ్ల స్థలాలు కోల్పోయిన తమకు ప్రభుత్వం ప్రకటించిన పునరావాస ప్యాకేజీని పూర్తిస్థాయిలో అమలు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
పెండింగ్‌లో రూ.33కోట్లు
గుండెగాం ముంపు బాధితుల పునరావాసం కోసం ప్రభుత్వం సుమారు రూ.94 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. ఇందులో రూ.61 కోట్లు మంజూరై విడుదలైనప్పటికీ మరో రూ.33 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. పెండింగ్ నిధులు విడుదల చేసి పునరావాస ప్రక్రియను పూర్తిచేయాలని కోరుతున్నారు.
అధికారులకు వరుస వినతులు
పునరావాసం కోసం గ్రామస్తులు గతంలో కలెక్టర్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులకు పలుసా ర్లు వినతిపత్రాలు అందించారు. 2022లో పునరావాసానికి సంబంధించి వివిధ ప్రభుత్వ ఉత్తర్వులు, అధికారిక ఉత్తర్వులు వెలువడినా పూర్తి స్థాయిలో అమలు జరగలేదని గ్రామస్తులు చెబుతున్నారు. 2024 నవంబర్‌లోనూ కలెక్టర్‌కు గ్రామస్తుల తరఫున వినతిపత్రం అందజేశారు. నిధులు, పునరావాస చర్యలు త్వరగా పూర్తి చేపట్టాలని కోరారు.
వర్షాకాలం వస్తే ముంపే..
ప్రాజెక్ట్ నిర్మాణం కారణంగా ప్రతీ వర్షాకాలంలో గుండెగాం గ్రామానికి ముంపు ప్రమాదం పొంచి ఉంది. గతంలో పలుసార్లు గ్రామంలోకి నీరు చొ చ్చుకురావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇళ్లు, రోడ్లు, వ్యవసాయ భూములు నీట మునిగిన సందర్భాలున్నాయి. మళ్లీ వర్షాకా లం ప్రారంభం కావడంతో గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. భారీ వర్షాలు కురిస్తే మరోసారి నీరు వచ్చే ప్రమాదముందని ఆవేదన చెందుతున్నారు.
తాత్కాలిక నివాసాల్లో అవస్థలు
ముంపు భయంతో కొన్నేళ్లుగా గ్రామస్తులు తమ స్వగ్రామంలో పూర్తిస్థాయిలో నివసించలేని పరిస్థితి ఏర్పడింది. తాత్కాలిక నివాసాల్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. వ్యవసాయ భూములు కోల్పోవడంతో పాటు జీవనోపాధిపై కూడా ప్రభావం పడిందని బాధిత కుటుంబాలు చెబుతున్నాయి. పునరావాసం పూర్తికాకపోవడంతో తమ భవిష్యత్ ఏమిటన్న ఆందోళన వారిని వెంటాడుతోంది.
470 కుటుంబాలకు ముంపు కష్టాలు


