‘సన్న’ మెలిక.. అన్నదాత తికమక! | - | Sakshi
Sakshi News home page

‘సన్న’ మెలిక.. అన్నదాత తికమక!

Aug 26 2026 12:30 AM | Updated on Aug 26 2026 12:30 AM

నమోదు చేసుకున్న సన్న వడ్లకే బోనస్‌ ఈ ఉత్తర్వులకు ముందే నార్లు పోసిన రైతులు కొత్త నిబంధనలతో అంతా గందరగోళం

భైంసా: జిల్లా వ్యాప్తంగా ఈ ఖరీఫ్‌లో సుమారు లక్ష ఎకరాల్లో వరి సాగు అవుతోంది. రెండేళ్లుగా రైతులు వానాకాలం సన్నవడ్లే సాగు చేస్తున్నారు. ప్రభుత్వం క్వింటాల్‌కు కూ.500 బోనస్‌ ఇస్తుండడంతో సన్నాల సాగు పెరిగింది. ఈ ఏడాది కూడా రైతులు వివి ధ రకాల సన్నవడ్లు సీజన్‌ ప్రారంభంలోనే నార్లు పో సుకున్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం తెచ్చిన కొత్త నిబంధన రైతులకు ఇబ్బందిగా మారింది. వి త్తనాలు కొనుగోలు చేసిన డీలర్‌ వద్దనే రైతులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. అలా నమోదు చేసిన వడ్లకే బోనస్‌ ఇస్తామని పేర్కొంది. గతంలో ఏఈవోలు గ్రామాల్లోనే క్షేత్రస్థాయిలో పరిశీలించి పంట నమోదు చేసేవారు. ఇప్పుడు విత్తనాలు కొనుగోలు చేసిన డీలర్ల వద్ద నమోదు చేయించుకోవాలన్న నిబంధన రైతులను నిరాశకు గురిచేస్తోంది. నార్లు పోసుకున్నాక నిబంధనలు, డిక్లరేషన్‌, ఆన్‌లైన్‌ నమోదు వంటి నిబంధనలు విధించడంతో గందరగోళం నెలకొంది.

ఇప్పటికే నార్లు పోశారు

జిల్లా సరిహద్దు ప్రాంతాల రైతుల్లో చాలామంది ప క్కనే ఉన్న నిజామాబాద్‌ జిల్లా నుంచి సన్న రకాల విత్తనాలు కొనుగోలు చేస్తారు. మార్కెట్‌లో మంచి దిగుబడి, నాణ్యత ఉన్న సన్న రకం వడ్లను తీసుకొ చ్చి విత్తనంగా ఉపయోగించడం ఇక్కడ ఆనవాయి తీ. గ్రామాల్లోనే మంచి దిగుబడి వచ్చిన రైతుల వద్ద వడ్లు తీసుకుని శుద్ధి చేసి తదుపరి సీజన్‌కు విత్తనంగా వాడే వారి సంఖ్య కూడా ఎక్కువే. సాగు ప్రారంభానికి ముందే బోనస్‌కు అర్హమైన రకాలపై స్పష్టత ఇచ్చి ఉంటే ఆ రకాలను మాత్రమే ఎంచుకునేవారమని రైతులు చెబుతున్నారు.

ముందస్తు అవగాహన అవసరం

వరి సాగు ప్రారంభానికి ముందే బోనస్‌ నిబంధనలు, అర్హత కలిగిన రకాల వివరాలు, విత్తనం కొనుగోలు సమయంలో తీసుకోవాల్సి న జాగ్రత్తలు, సమర్పించాల్సిన పత్రాలపై గ్రామాల వారీగా వ్యవసాయ శాఖ అవగాహన కల్పించాలని రైతులు కోరుతున్నారు. పంట వేసిన తర్వాత నిబంధనలు చెప్పడంతో ప్రయోజనం కంటే గందరగోళమే ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే నారు పోసి నాట్లు వేసిన రైతుల విషయంలో ప్రభుత్వం ప్రత్యేకంగా స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.

సాగు మధ్యలో సంకటం..

ప్రభుత్వం ప్రకటించిన సమాచారం ప్రకారం కొన్ని సన్న రకాలకు మాత్రమే బోనస్‌ పరిగణనలోకి తీసుకుంటున్నట్లు రైతులకు తెలిసింది. ఇతర సన్న రకాలు వేసిన వారికి తమ పంటకు బోనస్‌ వస్తుందా లేదా అనే సందేహం నెలకొంది. సాగు సమయంలో ఏ రకానికి బోనస్‌ వస్తుందో స్పష్టంగా చెప్పలేదు. అందుబాటులో ఉన్న విత్తనం కొని నారు పోశాం. ఇప్పుడు పంట వేసిన తర్వాత రకాల పేర్లు, నిబంధనలు చెబితే ఎలా మార్చుకోవాలని పలువురు ప్రశ్నిస్తున్నారు.

స్పష్టత కోసం రైతుల డిమాండ్‌..

బోనస్‌ విషయంలో రకాల ఎంపిక, విత్తనం ఆధారం, రైతు డిక్లరేషన్‌, కొనుగోలు కేంద్రంలో అర్హత వంటి అంశాలపై అధికారులు గ్రామాల్లో స్పష్టమైన అవగాహన కల్పించాలని రైతులు కోరుతున్నారు. ముఖ్యంగా సరిహద్దు జిల్లాల నుంచి విత్తనం తెచ్చుకునే వారు, సొంతంగా విత్తనం తయారు చేసుకునే వారి విషయంలో ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement