● ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తరలిరావాలి ● టీజీఈజేఏసీ జిల్లా నాయకుల పిలుపు
నిర్మల్: రాష్ట్రంలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు 27న జిల్లాకేంద్రానికి తరలిరావాలని టీజీఈజేఏసీ జిల్లా చైర్మన్ వెల్మల ప్రభాకర్, గౌరవ చైర్మన్ ఎంసీ లింగన్న, సెక్రెటరీ జనరల్ ధాత్రిక రమేశ్ కోరారు. స్థానిక పెన్షనర్స్ భవన్‌లో మంగళవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాట్లాడారు. మున్సిపల్ కార్యాలయం వద్ద గురువారం ఉదయం 10 గంటలకు మహాధర్నా ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. రెండో పీఆర్సీని ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలు విడుదల చేయాలని, ఉద్యోగ, ఉపాధ్యాయులకు 2004 నుంచి అమలు చేస్తున్న సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్లతో ధర్నా చేయనున్నట్లు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులను చెల్లించడానికి ప్రతీనెల రూ.2 వేల కోట్లు కేటాయించాలన్నారు. పూర్తిస్థాయి ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాదవ్ వెంకట్రావ్, కోచైర్మన్లు జె.లక్ష్మణ్, పెంట అశోక్, భూమన్న యాదవ్, దర్శనం దేవేందర్, గడ్డం భూమన్న, మహేంద్రచారి, వహీద్‌ఖాన్, టీఎన్‌జీవోస్ సెక్రెటరీ జనరల్ కుడాల రవికుమార్, ఏఈవోల సంఘం జిల్లా అధ్యక్షుడు అశోక్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం కార్యదర్శి జాదవ్ గణేశ్, వెటర్నరీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.


