నిర్మల్‌ఖిల్లా: ప్రపంచ జానపద దినోత్సవం పురస్కరించుకొని జానపద కళాకారుల ఫోరం ఆధ్వర్యంలో మంగళవారం జానపద దినోత్సవ సంబరాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన కళాకారులు ప్రదర్శించిన జానపద నృత్యాలు, పాటలు, వివిధ కళారూపాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా సీనియర్ కళాకారుడు ఫిరంగి జోసఫ్ బాబురావు మాట్లాడుతూ.. కళ కళ కోసం కాదు.. కళ సమాజం కోసం అనే స్ఫూర్తితో కళాకారులు ముందుకు సాగాలన్నారు. అంతరించిపోతున్న జానపద కళారూపాలను గుర్తించి, వాటి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమ నిర్వాహకులు, వెన్నెల డాన్స్ అకాడమీ డైరెక్టర్ ధనరాజ్ మాట్లాడుతూ జానపద కళాకారులందరినీ గుర్తించి వారికి తగిన గౌరవం కల్పించడంతోపాటు సన్మానించడం ఎంతో అవసరమన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులందరినీ ఘనంగా సన్మానించి, ప్రశంసాపత్రాలు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో మహిపాల్ స్వామి, బిరుదుల సురేశ్, ఆష్ట దిగంబర్, సాయికృప, మమత, సతీశ్, జగదీశ్వర్, పోలీస్ భీమేష్, రాజేశ్వర్, పాటల రాజేశ్వర్, జన్ను అనిల్, జీవన్, రౌడీ సింగర్ గోపి, అమ్మ సాయి, లక్ష్మణ్ తదితర కళాకారులు పాల్గొన్నారు.


