నిర్మల్ రూరల్: పాలిటెక్నిక్ విద్యను శక్తి ప్రోగ్రాంలో విలీనం చేయవద్దని ఐదు రోజులుగా విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. శని వారం కూడా పోరాటం కొనసాగింది. ప్రభుత్వం ఇచ్చిన జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్ వద్ద మానవహారం, మహాధర్నా నిర్వహించారు. వీరికి బీజేవైఎం నాయకులు మద్దతు తెలిపారు. విద్యార్థులు, నాయకులు రోడ్డుపై బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేవైఎం యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, విద్యార్థులు మాట్లాడుతూ.. ప్రభుత్వం విడుదల చేసిన జీవోతో రాష్ట్రంలో పాలిటెక్నిక్ కళాశాలలు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. విద్యార్థులు ఇండస్ట్రీయల్ ట్రైనింగ్ దూరం కావడంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరుతో ప్రభుత్వం ఉన్నత విద్యను విద్యార్థులకు దూరం చేసే ప్రయత్నం చేస్తుందన్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీజేవైఎం నాయకులు దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నా రు. ధర్నా గంటన్నరపాటు కొనసాగడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ట్రాఫిక్‌ను మళ్లించారు. టౌన్ సీఐ సమ్మయ్య విద్యార్థులను సముదాయించి ధర్నా విరమింప చేశారు. ఇందులో కౌన్సిలర్లు సూరజ్‌నాయక్, సాత్విక్, బీజేవైఎం నాయకులు వెంకటేశ్, భరత్, విజయ్, సృజన్, బంటి, చరణ్, దీక్షిత్, అనిల్, పాలిటెక్నిక్ విద్యార్థులు ఉన్నారు.


