నిర్మల్ రూరల్: ఓపెన్ స్కూల్ విద్యను చదువు మధ్యలో మానేసిన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవా లని డీఈవో భోజన్న సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రియదర్శినీనగర్ ప్రభుత్వ పాఠశాలలో టాస్ అడ్మిషన్ ప్రక్రియపై శనివారం సమీక్ష నిర్వహించారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ ఓపెన్ అడ్మిషన్లకు వయోపరిమితి లేదన్నారు. జిల్లాలో 26 స్టడీ సెంటర్లు ఉన్నాయని, ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నిరంతరం చదువు కొనసాగించలేని, మధ్యలో బడి మానేసిన వారికి మరో అవకాశం కల్పించడమే టాస్ ముఖ్య ఉద్దేశమన్నారు. పదో తరగతికి 14 సంవత్సరాలు నిండిన వారు, ఇంటర్మీడియట్‌కు 15 ఏళ్లు పైబడినవారు అర్హులని తెలిపారు. చదవడం, రాయడం వచ్చి ఉండాలని పేర్కొన్నారు. తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ మీడియంలో గుర్తింపు పొందిన సర్టిఫికెట్, ఉచిత స్టడీ మెటీరియల్ అందిస్తామన్నారు. బడి బయట ఉన్న విద్యార్థులు, కూలీలు, రైతులు, ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇందులో ఉమ్మడి జిల్లా సమన్వయకర్త అశోక్, గ్రామీణాభివృద్ధి శాఖ డీపీఎం శోభారాణి, జిల్లా విద్యాశాఖ సమన్వయకర్త ప్రవీణ్ కుమార్, ప్రధానోపాధ్యాయులు సుచిత్ర, అధ్యయన కేంద్రాల హెచ్‌ఎంలు, సహాయ సమన్వయకర్తలు, ఏపీఎం, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.


