నిర్మల్‌చైన్‌గేట్: సెన్సస్ హ్యాండ్ బుక్ తయారీకి శాఖల వారీగా పూర్తి వివరాలు నిర్దేశిత గడువులోగా సమర్పించాలని జిల్లా అదనపు కలెక్టర్లు బి.వెంకటేశ్వర్లు, కిశోర్‌కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సెన్సస్ హ్యాండ్ బుక్ రూపకల్పనపై వివిధ శాఖల అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ప్రణాళిక శాఖ అందించిన ప్రామాణిక నమూనా ప్రకారం క్షేత్రస్థాయిలో అవసరమైన సమాచారాన్ని సేకరించాలన్నారు. హ్యాండ్ బుక్ జిల్లా అధికారిక రికార్డుగా నిలుస్తుందని, శాఖల వారీగా ఇచ్చే గణాంకాలలో ఎలాంటి తప్పులు లేకుండా పూర్తి కచ్చితత్వం ఉండాలన్నారు. సమాచారం పునరావృతం కాకుండా ఉండేందుకు వివిధ శాఖల అధికారులు ఒకరికొకరు పరస్పర సమన్వయంతో వ్యవహరించాలన్నారు. అధికారులు సమర్పించే నివేదికలు జిల్లా భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు క్షేత్రస్థాయిలో సరిగ్గా చేర్చడానికి దోహదపడతాయన్నారు. సమాచార సేకరణ, నమోదు ప్రక్రియను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డిప్యూటీ కలెక్టర్ రాకేశ్, డీఆర్‌వో రాథోడ్ రమేశ్, సీపీవో గంగారెడ్డి, డీఈవో భోజన్న, అధికారులు పాల్గొన్నారు.


