జన్నారం: వరలక్ష్మీ వ్రతం రోజు అక్రమంగా లక్ష్మీదేవి కటాక్షం పొందబోయిన పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి చిక్కింది. ఏసీబీ డీఎస్పీ మధు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని లింగయ్యపల్లి గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం, ఇంటి నంబర్ అనుమతి కోసం సంప్రదించగా రూ.15లు లంచం డిమాండ్ చేశారు. చివరకు రూ.13వేలు తీసుకోవడానికి ఒప్పుకొన్నారు. దీంతోబాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. అధికారుల సూచన మేరకు శుక్రవారం లంచం డబ్బులు చెల్లిస్తామని వరలక్ష్మికి తెలిపాడు. దీంతో ఆమె నగదు వద్దని, తాను సూచించిన నంబర్‌కు ఫోన్ పే చేయాలని కోరారు. దీంతో బాధితుడు కార్యదర్శి ఇచ్చిన నంబర్‌కు రూ.13వేలు ఫోన్ పే ద్వారా పంపించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు కార్యదర్శిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని విచారించారు. అవి లంచం డబ్బులు అని నిర్ధారణ కావడంతో వరలక్ష్మిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఫోన్‌పే నంబర్ గల వ్యక్తి కూడా పంచాయతీ కార్యదర్శే అని సమాచారం. విచారణ అనంతరం సదరు కార్యదర్శిపై కూడా చర్యలు తీసుకోనున్నట్లు డీఎస్పీ తెలిపారు. పట్టుబడిన వరలక్ష్మిని కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.


