కోల్‌సిటీ: క్రీడలు పోలీసు సిబ్బందిలో శారీరక దారుఢ్యంతోపాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, సమన్వయం, జట్టు స్ఫూర్తిని పెంపొందిస్తాయని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. గోదావరిఖని ఆర్‌సీవో క్లబ్‌లో ఐదో తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026 క్లస్టర్–ఇ కాళేశ్వరం జోన్ పోలీస్ క్రీడా పోటీలను ఆయన శుక్రవారం ప్రారంభించారు. షటిల్, బ్యాడ్మింటన్, లాన్‌టెన్నిస్, టేబుల్ టెన్నిస్ విభాగాల్లో ఓపెన్ కేటగిరితోపాటు 18–30, 40+, 50+ విభాగాల్లోనూ పోటీలు నిర్వహిస్తున్నారు. కాళేశ్వరం జోన్ పరిధిలోని రామగుండం పోలీస్ కమిషనరేట్, కుమురంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల పోలీస్ క్రీడాకారులు పాల్గొంటున్నారు. పోటీల విజేతలు వచ్చే నెల 7, 8, 9వ తేదీల్లో హైదరాబాద్‌లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో జోన్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ(అడ్మిన్) శ్రీనివాస్, గోదావరిఖని ఏసీపీ రమేశ్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఆర్‌ఐలు దామోదర్, పెద్దన్న, రమేశ్, మల్లేశం, ఆర్‌ఎస్‌ఐలు వెంకట్, శివ తదితరులు పాల్గొన్నారు.


